
న్యూఢిల్లీ : మహారాష్ట్ర ఫ్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఏర్పడిన కొత్త అధికార కూటమి ఆరు నెలల్లో కూలిపోతుందని ఎన్సిపి అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యల తరహాలోనే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుందని తాను భావించడంలేదనీ, ఇది అనైతిక, అప్రజాస్వామిక సర్కారు అని ధ్వజమెత్తారు. వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుండవచ్చు, కానీ ప్రజల హఅదయాలను గెలవలేరు అని మమతా అభిప్రాయపడ్డారు.
సోమవారం నిర్వహించిన 'ఇండియా టుడే క్లాన్కేవ్ ఈస్ట్-2022' కార్యక్రమంలో సిఎం మమతా బెనర్జీ పలు అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దీదీ పాట కూడా పాడారు. ముందుగా పాడటానికి సంకోచించిన ఆమె.. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా తనకు ఎంతగానో స్ఫూర్తినిచ్చిన 'ఏ మేరే వతన్ కే లోగో' అనే ప్రసిద్ధ పాటను ఆలపించి అందర్నీ అలరించారు.
మీడియా నిష్పాక్షికంగా పనిచేసి ప్రజలకు న్యాయం అందేలా చూడాలి : మమతా
'ఇండియా టుడే క్లాన్కేవ్ ఈస్ట్-2022' కార్యక్రమంలో సిఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ... రానున్న రోజుల్లోనూ మీడియా నిష్పాక్షికంగా పనిచేసి ప్రజలకు న్యాయం అందేలా చూడాలని కోరారు. దేశాభివఅద్ధి కోసం అనుక్షణం పాటుపడే మీడియా మిత్రులను ప్రశంసించారు.
దేశ ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో బిజెపిని బుల్డోజ్ చేస్తారు : మమతా
ఈ సందర్భంగా బిజెపి పై మమతా బెనర్జీ పలు విమర్శలను గుప్పించారు. ఆమె మాట్లాడుతూ ... 2024లో జరిగే ఎన్నికలు పాలకులను ఎన్నుకొనేందుకు కాకుండా బిజెపిని తిరస్కరించేందుకు జరుగుతాయన్నారు. దేశ ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో బిజెపిని బుల్డోజ్ చేస్తారని చెప్పారు. ఎన్నుకునేందుకు కాదు.. బిజెపికి వ్యతిరేకంగా పార్టీ నేతలని తిరస్కరించేందుకే ప్రజలు ఓటు వేస్తారని మమతా ధీమా వ్యక్తం చేశారు.
వాళ్లు ప్రజల హృదయాలను గెలవలేరు : మమతా
ఏక్నాథ్ షిండే-దేవేంద్ర ఫడణవీస్ సారథ్యంలోని కూటమి త్వరలోనే పడిపోతుందని మమతా చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుందని తాను భావించడంలేదని అన్నారు. ఇది అనైతిక, అప్రజాస్వామిక సర్కారు అని ధ్వజమెత్తారు. వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుండవచ్చు, కానీ ప్రజల హఅదయాలను గెలవలేరు అని పేర్కొన్నారు. ' మీరు మీ అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అణచివేయవచ్చు, కానీ ఈ దేశ ప్రజలు ప్రజాస్వామ్య మార్గాలను ఉపయోగించి మిమ్మల్ని కిందకు దింపుతారు ' అని మమతా అన్నారు.
యువత దేశ బాధ్యతలను చేపట్టాలని మీకు లేదా ? : మమతా
బిజెపి తరచూ ఖండిస్తూ వస్తున్న వారసత్వ రాజకీయాలపై మమతా స్పందిస్తూ ... బిజెపి దేన్ని వారసత్వ రాజకీయం అంటోంది ? అని ప్రశ్నించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ ముజిబుర్ రెహ్మాన్ మరణం తర్వాత ఆయన కుమార్తె షేక్ హసీనా ఆ బాధ్యతలు చేపట్టారని... ఆమె కాకుండా ఇంకెవరు ఆ స్థానాన్ని భర్తీ చేసేవారు ? అని అడిగారు. రాజకీయాల్లో తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ రాజకీయాల్లో ఉండటం వల్ల ఎవరికైనా ప్రమాదం ఉందా ? అని ప్రశ్నించారు. ప్రజలు రెండుసార్లు అతడిని ఎన్నుకున్నారని చెప్పారు. యువత దేశ బాధ్యతలను చేపట్టాలని మీకు లేదా ? అని నిలదీశారు.
ఆ వారసత్వ పదవి గురించి మాట్లాడరేం : మమతా
వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలంటున్న బిజెపి.. మరెందుకు హౌంమంత్రి అమిత్ షా కుమారుడు జై షాకు బీసీసీఐలో అత్యున్నత పదవి కట్టబెట్టిందని మమతా అడిగారు. ఈ వారసత్వ పదవి గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తారని, అయితే అవి బిజెపికి వ్యతిరేకంగా వేస్తారని మమతా వ్యాఖ్యానించారు.