Oct 02,2022 11:21

గుజరాత్‌ రాష్ట్రమ్మున
పోరుబందరు ఊరులోన
పుతలీబాయి గర్భమ్మున
బాపూజీ జనియించెను

రాజ్‌ కోట్‌ ఊరు లోన
ప్రాధమిక విద్యలో
ఉత్తీర్ణత సాధించెను
అన్న ప్రోత్సాహంతో
లండన్‌కు వెళ్ళెను
బారిష్టరుగా చదివి
పట్టాను పొందెను

అమ్మ చెప్పిన మాటలు
తప్పక పాటించెను
లండన్‌లో జీవితము సాగించెను
లాయరుగా మొదటిసారి
దక్షిణాఫ్రికా వెళ్ళెను
రైలు ప్రయాణము లోన
జాతివివక్ష నెదుర్కొనెను

అహింసే ఆయుధంగా
పోరాటము సాగించెను
తెల్లవారి చట్టాలను
ధైర్యంగా ఎదుర్కొనెను

ఇండియాకు తిరిగివచ్చి
ఘనస్వాగతం పొందెను
సత్యాగ్రహ ఆశ్రమమును
సబర్మతిలో స్థాపించెను

చంపారన్‌ ఉద్యమాన్ని
శాంతియుతంగా చేసెను
నీలిమందు రైతులకు
విజయమును చేకూర్చెను
శాంతిపోరుతో సహాయ
నిరాకరణ చేసెను
సహనమే సమస్యకు
పరిష్కారమని చెప్పెను

పోరుబాటలోన సాగి
పలుమార్లు జైలుకెళ్లి
భరతమాత స్వేచ్ఛకై
అవిరళకృషి సల్పెను

ఉప్పు సత్యాగ్రహంతో
ఉప్పెనలా ఉరికెను
క్విట్‌ ఇండియా ఉద్యమముతో
స్వేచ్ఛను సాధించెను

బానిసత్వ బాధనుంచి
భరతజాతి బయటపడెను
మన త్రివర్ణ పతాకము
గగన సీమనెగెరెను

నిరాడంబరమే బాపు
ఆభరణము అయ్యెను
సత్యము అహింసలే
ఆయుధములుగ అమరెను

గ్రామ స్వరాజ్యమునకై
ఎల్లప్పుడు కలలు కనెను
మతము కన్నా మానవతే
ఎల్లడెలా మిన్న అనెను

అంటరానితనము ఎపుడు
దేశానికి శాపమనెను
మద్యపాన నిషేధము
అభివృద్ధికి మూలమనెను

సత్యనిష్ఠ క్రమశిక్షణలే
గాంధీజీ రూపము
నిజాయితీ నిబద్ధతకు
బాపు నిలువటద్దము

బాపూ ఒక స్ఫూర్తిదాత
బాపూ ఒక క్రాంతిదర్శి
అతని జీవనమార్గమే
అద్భుత సందేశం!

(నేడు గాంధీ జయంతి)
- రావిపల్లి వాసుదేవరావు
94417 13136