
లిమా : పెరూలో మెజారిటీ ప్రజలు ఈ ఏడాది ఎన్నికలు జరపాలని కోరుకుంటున్నట్లు ఆదివారం ఓ ఎన్నికల సర్వే తెలిపింది. గతేడాది అక్టోబర్ నుండి పెరూ అధ్యక్షురాలు డినా బొలూర్టే రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆందోళనలపై సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. లా రిపబ్లికా అనే వార్తాపత్రిక కోసం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెరూవియన్ స్టడీస్ (ఐఇపి) ఈ సర్వేను నిర్వహించింది. తాజాసర్వేలో 73 శాతం జనాభా ఈ ఏడాది ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. 75 శాతం పెరూవియన్లు అధ్యక్షురాలు రాజీనామా చేయడాన్ని సమర్థించగా, 74 శాతం మంది ప్రస్తుత కాంగ్రెస్‌ను రద్దు చేయాలని కోరుకుంటున్నారు. పెరూ ప్రధాని అల్బెర్టో ఒటారోలా పనితీరుకు సంబంధించిన సర్వేలో.. 71 శాతం మంది ఆయన పనితీరును వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడైంది. పార్లమెంటు కొనసాగడాన్ని జనాభాలో 89 శాతం మంది తిరస్కరించారు. ఈ సంఖ్య కొద్దిరోజుల్లోనే ఒక శాతం పెరిగింది. అదేవిధంగా, 76 శాతం మంది పౌరులు కాంగ్రెస్ అధ్యక్షుడు జోస్ విలియమ్స్ నిర్వహణను తిరస్కరించగా, ఈ శాతం మునుపటి సర్వేతో పోలిస్తే 4 పాయింట్లు పెరిగినట్లు తెలిపింది. కేవలం 14 శాతం మంది మాత్రమే అతని నిర్వహణను ఆమోదించారు. శనివారం రాత్రి లిమాలో ప్రదర్శనకారులపై పోలీసులు జరిపిన హింసాకాండలో ఓ వ్యక్తి మరణించగా.. ఇప్పటివరకు నిరసన ప్రదర్శనల్లో సుమారు 60 మందికి పైగా మరణించారు.