Oct 02,2022 20:36

- గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేత
ప్రజాశక్తి-యంత్రాంగం :
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రెగ్యులర్‌ చేయాలని కోరుతూ గుంటూరు, కర్నూలు, కడప జిల్లాల్లో గాంధీ విగ్రహాలకు మున్సిపల్‌ కార్మికులు ఆదివారం వినతి పత్రాలు సమర్పించారు. మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గన్నారు. ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో గాంధీ విగ్రహానికి యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నోఏళ్లుగా పని చేస్తున్న మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, ఇంజినీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్న వారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, హెల్త్‌ అలెవెన్స్‌ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విజయనగరం జిల్లా బబ్బిలిలో గాంధీ విగ్రహం వద్ద కార్మికులు నిరసన తెలిపారు. తొలుత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ 20 ఏళ్లుగా మున్సిపల్‌ కార్మికులతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటోందని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా అమలు చేయడం లేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చెత్త పన్ను రద్దు చేయాలని కోరుతూ వైఎస్‌ఆర్‌ జిల్లా కడపలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ శాంతియుత పద్ధతిలో పోరాడారని, అదే స్ఫూర్తితో చెత్త పన్ను రద్దు కోసం సిపిఎం పోరాటం సాగిస్తుందని తెలిపారు. ఇప్పటికే నగర ప్రజలు వివిధ రూపాల్లో భారాలు భరిస్తున్నారని, మళ్లీ యూజర్‌ ఛార్జీల పేరుతో చెత్త పన్ను వేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు.