Aug 19,2022 06:29

దేవుడి ఉనికే శూన్యమైనప్పుడు దాన్ని ఎన్ని ఆర్భాటాలతో హెచ్చవేస్తే మాత్రం ఏం లాభం? సున్నా సున్నాయే కదా? దైవ భావన చుట్టూ ఎన్ని శాస్త్రాలు రాసుకున్నా, ఎన్ని కీర్తనలు పాడుకున్నా, ఎన్ని సంప్రదాయ నత్యాలు చేసినా, ఎన్ని ఆచార వ్యవహారాలకు రూపకల్పన చేసినా ఏం లాభం? పునాదిలేని భవనం కూలిపోవాల్సిందే! పుచ్చిన కర్ర విరిగిపోవాల్సిందే!! మనిషే, మనిషిని కాపాడుకోవాల్సి ఉంది.
ఎలక్ట్రిక్‌ బల్బు ఎంత అందంగా ఉన్నా, లోన ఫిలమెంట్‌ పోతే బల్బు పనికిరాదు. ఫిలమెంట్‌ సైన్స్‌ ప్రిన్సిపల్‌ మీద తయారయ్యింది. గాజు బల్బూ సైన్సువల్ల వచ్చిందే. మన వాళ్ళు గుళ్ళూ, గోపురాలు చూసి ఆనాటి ఇంజనీరింగ్‌ ప్రతిభ గుర్తించరు. అందులో కల్పించుకున్న ఒక దేవుణ్ణి, శక్తిని...వారి మహత్యాల్ని ప్రవచిస్తుంటారు. వారికి వారే పరవశించిపోతుంటారు. రామాయణ, భారత, భాగవతాలు, పురాణాలు ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా అవే పాత కథలు. మనిషి ఔన్నత్యం ఎక్కడైనా కనిపిస్తుందా? మనిషి, దైవత్వానికి దాసోహం అయిన గాథలు మహోన్నతంగా చెప్పడమే గానీ మరొకటుందా? దైనందిన జీవితంలో దేవుడి ప్రసక్తి, సంభాషణల్లో దైవం, హితబోధలో దైవం, సంగీతంలో దైవం, సాహిత్యంలో దైవం, నాట్యంలో దైవం...మనిషి ఆత్మవిశ్వాసం దెబ్బ తీసే కళారూపాలు శతాబ్దాలుగా కొనసాగుతున్నప్పుడు, తరతరాలకు ఆ జాఢ్యం వ్యాపించక ఏమవుతుందీ? ఇవన్నీ చాలవన్నట్టు ప్రవచనాల పేరుతో కొందరు తమ తుప్పుపట్టిన భావజాలం ప్రచారం చేస్తుంటారు. మనుస్మృతి లోని విషయాలే గొప్పగా చేసి వర్ణిస్తూ ఉంటారు. ఇవన్నీ ఆధునిక ఆలోచనా ధోరణికి ఏమాత్రం సరిపడని విషయాలు కదా?
మన రోజువారీ సంభాషణల్లో 'అంతా దేవుడి దయ' - 'అంతా పైవాడు చూసుకుంటాడు' - 'ఈశ్వరాజ్ఞ లేనిది చీమైనా కదలదు' - లాంటి మాటలు వింటూ ఉంటాం. ఏమీ తెలియని పసిపాపలకు 'జేజ కొడతాడు దండం పెట్టు' - 'జేజ తీసుకు పోయాడు' - 'దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది' లాంటి మాటలు ఆ పసితనంలోనే నూరిపోస్తుంటారు. సామాన్యుడు చస్తాడు / కన్ను మూస్తాడు / మరణిస్తాడు. కానీ ఆధ్యాత్మిక గురువులు ఈశ్వరుడిలో ఐక్యమైపోతారు. చచ్చాడని గౌరవంగా చెప్పడం.. అంతే - జీవశాస్త్ర పరంగా ఏ చావైనా ఒకటే! ఇంతెందుకూ నాస్తిక, హేతువాద సంఘాల్లో పనిచేస్తున్న వారందరివీ దేవుడి పేర్లే. అవన్నీ వాళ్ళు పెట్టుకున్నవి కావు. ఆనవాయితీ ప్రకారం పెద్దలు పెడుతూ, పెడుతూ ఉండగా వచ్చినవి. నా ఇంటిపేరులో కూడా దేవ శబ్దం ఉంది. అది నేను పెట్టుకున్నది కాదు. అంటే నిస్సహాయంగా మనం మనువాదుల కుట్రలో కూరుకుపోయాం. బయటపడే మార్గాలు వెతకాలి! ఇవన్నీ మన చుట్టూ ఉన్న సమాజంలో మనం చూస్తున్న విషయాలు. మనకు అనుభవంలోకి వస్తున్న విషయాలు. మరి ప్రపంచమంతా ఇలాగే ఉందా-అంటే లేదు. కొంచెం స్థాయి పెంచుకుని, విశాల హృదయంతో ప్రపంచ దేశాల్లోని పరిస్థితిని గమనిస్తే మనం ఎక్కడ ఉన్నామన్నది అర్థం చేసుకోవచ్చు.
ఉదాహరణకు ఒక విషయం చూద్దాం. ఒక ఊళ్ళో ఒక చిన్న బళ్ళో ఒకటో తరగతిలో ఇరవై మంది పిల్లలున్నా రనుకుందాం. అందులో కొందరు పదో తరగతి వరకైనా రాకుండానే మానేస్తారు. మరికొందరు పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష పాస్‌ కాకుండా ఆగిపోతారు. ఇంకొందరు జూనియర్‌ కాలేజిలో, కొందరు డిగ్రీలో ఆగిపోతారు. అవన్నీ దాటి శాస్త్రవేత్తో, ఇంజనీరో, కంప్యూటర్‌ నిపుణుడో, డాక్టరో, ప్రొఫెసరో అయ్యేది అందులో ఏ ఇద్దరు ముగ్గురో ఉంటారు. ఇందులో పదో తరగతిలో కూడా ఉత్తీర్ణులు కానివారు ఆచారాల చాటున, పంచాంగాల చాటున, గుళ్ళ చాటున, దేవుళ్ళ చాటున దాక్కుని పొట్ట పోసుకుంటున్నారనుకుందాం. వీళ్ళు సంప్రదాయం పేరుతో, విద్యావంతుల్ని, జ్ఞానవంతుల్ని, సంస్కారుల్ని అందరినీ తమ ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆత్మ, పరమాత్మ, పునర్జన్మ లాంటి మాటలు చెప్పి భయపెడుతుంటారు. నిరూపణ లేని అనుభవాలు, అనుభూతులు, సెంటిమెంట్లు, దేవుడితో సెటిల్‌మెంట్లు చెపుతూ, పిట్టకథలతో జనాన్ని రంజింపజేస్తుంటారు. ఇవాళ కాకపోయినా రేపు... జనం నిజం గ్రహిస్తారు. కారణాన్ని అన్వేషిస్తారు. తప్పదు - కొందరు తమ ఇంగిత జ్ఞానాన్ని వదిలేసి అజ్ఞానుల మాటలకు విలువనిస్తుంటారు. తమ కన్నా ఆ పంతుళ్ళకు, ముల్లాలకు, పోప్‌లకు, మతాధిపతులకు ఏదో ఎక్కువ తెలుసుననుకుని వారిని అనుసరిస్తుంటారు. వారు చెప్పేవన్నీ మనిషి ఎప్పుడో ప్రాథమిక దశలో ఏర్పరుచుకున్న ఆచారాలు! మరి ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో అవి ఎంత వరకు అనుసరణీయం? అన్న ప్రశ్న వేసుకోరు. ఏదో గుడ్డిగా, తాతలు చేశారు, తండ్రుల చేశారు, మనమూ చేసేస్తే పోదా? అని అనుకుంటూ ఉంటారు. భయస్తులు, పిరికివాళ్ళు, తమ శక్తిని తాము తెలుసుకోలేని వాళ్ళు-తమ మెదడును తాము ఉపయోగించని వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది.
మనిషికి రాయిని కూడా దేవుణ్ణి చేసే శక్తి ఉంది. మరి ఆ దేవుడు గనక ఉంటే, మనిషినైనా మనిషిగా చేస్తాడా? చేయలేడు. ఎందుకు చేయలేడూ అంటే... అలాంటి వాడు ఎవడూ లేడు గనక చేయలేడు. మనిషి, మనిషిగా కావాలంటే మనిషి మాత్రమే ప్రయత్నించాలి. దైవ విశ్వాసంతో సమాజంలో రోజూ ఎన్ని ఘోరాలు జరుగు తున్నాయో తెలుసుకోవాలి. విశ్లేషించుకోవాలి. దైవ విశ్వాస రహిత, మానవ నైతిక సమాజానికి రూపకల్పన చేసుకోవాలి. పునర్జన్మ ఉంటుందన్న విశ్వాసంలో జనం ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. తమిళనాడు తిరుచ్చి జిల్లా చొక్కంపట్టికి చెందిన రిటైర్డ్‌ టీచర్‌ మేరి (75) 2021 అక్టోబర్‌ మొదటివారంలో మరణించారు. కూతుళ్ళు జెసితా (43), జయంతి (40) ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి ఏడు రోజులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అప్పుడే అనుకోకుండా వాళ్ళింటికి బంధువులు వచ్చారు. వారికి రిటైర్డ్‌ టీచర్‌ మరణించిన సమాచారం లేదు. తమ తల్లి పునర్జన్మ కోసం బైబిల్‌తో తాము ప్రార్థనలు చేసుకుంటూ ఉంటే, బంధువులు వచ్చి అంతరాయం కలిగించారంటూ ఆ కూతుళ్ళు బంధువుల్ని తరిమికొట్టారు. మృతదేహం పక్కన ప్రార్థనలు చేస్తున్నారని వాళ్ళు ఊళ్ళో వాళ్ళకు, పోలీసులకు తెలిపారు. పోలీసులు రంగప్రవేశం చేసి, మృతదేహం స్వాధీనపరుచుకుని, కూతుళ్ళను వైద్య పరీక్షలకు పంపించారు. ఇలాంటి సంచలన సంఘటనలు మనం తరచూ టెలివిజన్‌ తెర మీద చూస్తూనే ఉన్నాం.
ఉత్తరాఖండ్‌ బాగేశ్వర్‌ జిల్లా కదిరియా గ్రామంలో 2021 అక్టోబర్‌ మొదటి వారంలో జరిగిన సంఘటన! కుల వివక్షతో ప్రాణాలు తీయడం ఈ రోజుల్లో ఎంతో సులభమైపోయింది. సోహాన్‌ రామ్‌ (31) పిండిమరలో గోధుమలు ఆడించి పిండి తీసుకుపోతుండగా లలిత్‌ కర్నాటక్‌ అనే అగ్రకులస్థుడు చూసి అడ్డగించాడు. అతను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. పిండిమర మలినమైందని ఆక్రోశిస్తూ, దళితుడైన సోహాన్‌ ని అతని కులాన్ని తీవ్రంగా దూషించాడు. అనవసరంగా ఎందుకు దూషిస్తున్నారని సోహాన్‌ అడిగినందుకు - పిండిమర అందరూ ఉపయోగించేదేనని గుర్తుచేసినందుకు ఉక్రోషం పట్టలేని అగ్రకుల ఉపాధ్యాయుడు, కొడవలితో నరికి సోహాన్‌ను హత్య చేశాడు. హంతకుణ్ణి పోలీసులు జైలుకు పంపించారు. పిండిమర మలినం కావడం ఏమిటో? వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన వాడికే సరైన ఆలోచన లేకపోవడం ఏమిటో? మన పవిత్ర భారతావనిలో ఏదైనా సాధ్యమే! దేవుడనేవాడు ఉంటే ఇలాంటివి ఎందుకు ఎలా జరిపిస్తున్నాడూ?
ప్రపంచానికి ఆధ్యాత్మిక వెలుగులు పంచిన మన భారతదేశంలో అదేమిటో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఇతర సమాజాలు ఇలాంటివి లేకుండా ఏమీ లేవు. ప్రఖ్యాత రచయిత్రి తస్లీమా నస్రీన్‌ ఏమన్నారో చూడండి...! ''మసీదులో ప్రార్థన చేస్తుండగా ఆఫ్ఘనిస్తాన్‌లో షియాలను సున్నీలు చంపుతారు. హజారా సమాజాన్ని తాలిబన్‌ చంపుతుంది. పాకిస్తాన్‌లో షియాల్ని, అహ్మదీయుల్ని, క్రైస్తవుల్ని సున్నీలు చంపుతారు. ఏ దేశంలో మైనార్టీలకు రక్షణ లేదో.. ఆ సమాజాలు కచ్చితంగా నాగరికం కాదు'' అని!
''నాకు ఈ రోజు అల్లాఉద్దీన్‌ అద్భుత దీపం దొరికింది'' అన్నాడు భర్త భార్యను ఉడికిస్తూ... ''ఓ డియర్‌ ఎంత మంచి మాట? మరి ఏమడిగావ్‌?'' అంది భార్య. ''ఏముందీ? నీ తెలివితేటలు పదింతలు పెంచుమని అడిగా!'' అన్నాడు భర్త. ''ఓ ధ్యాంక్యూ! డాళ్లింగ్‌!! నా గురించి నీకెంత శ్రద్ధా?'' అంది భార్య. ''కాని యేం లాభం? సున్నాను ఎన్నింతలు చేస్తే మాత్రం ఏం ఫలితం? సున్నా-సున్నాయే కదా?'' అని చల్లాగా చెప్పాడు భర్త లోలోన తన తెలివికి తానే మురుస్తూ! ఇది జోకే అయినా, ఇందులో ఒక విషయం ఉంది. భార్యా భార్తల మధ్య సరదా మాటలు పక్కనపెట్టి, మనం మతాలు-దేవుడు విషయం ఆలోచిస్తే.. అదీ దాదాపు ఇలాగే ఉంటుంది. దేవుడి ఉనికే శూన్యమైనప్పుడు దాన్ని ఎన్ని ఆర్భాటాలతో హెచ్చవేస్తే మాత్రం ఏం లాభం? సున్నా సున్నాయే కదా? దైవ భావన చుట్టూ ఎన్ని శాస్త్రాలు రాసుకున్నా, ఎన్ని కీర్తనలు పాడుకున్నా, ఎన్ని సంప్రదాయ నృత్యాలు చేసినా, ఎన్ని ఆచార వ్యవహారాలకు రూపకల్పన చేసినా ఏం లాభం? పునాదిలేని భవనం కూలిపోవాల్సిందే! పుచ్చిన కర్ర విరిగిపోవాల్సిందే!! మనిషే, మనిషిని కాపాడుకోవాల్సి ఉంది.

devaraju

 

 

 

 

వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత,జీవశాస్త్రవేత్త  డా.దేవరాజు మహారాజు