Sep 22,2022 22:05

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :గురుకుల పాఠశాలలు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యత మండల విద్యాశాఖ అధికారి(ఎంఇఒ)కి అప్పగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లపై సిఎం క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలాల్లో ఇద్దరు ఎంఇఒల నియామకం ద్వారా ఎలా పర్యవేక్షణ చేస్తున్నామో ఆ తరహాలోనే ఇక్కడ కూడా పర్యవేక్షణ జరగాలని ఆదేశించారు. దీనికోసం ఎస్‌ఒపిలు రూపొందించాలన్నారు. పర్యవేక్షణ కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాలు, భోజనం నాణ్యత, నిర్వహణ తదితర అంశాలపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. పర్యవేక్షణ వరకూ వీటిని ఇంటిగ్రేట్‌ చేయాలని, ఒక్కో అధికారికి ప్రత్యేక పరిధిని నిర్ణయించి పర్యవేక్షణ చేయించాలన్నారు. మండలాల్లో స్కూల్స్‌ నిర్వహణ, పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నియమిస్తున్న రెండో ఎంఇఒకు కూడా విధివిధానాలు ఖరారు చేయాలని ఆదేశించారు. హాస్టళ్లలో టివి, ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలని చెప్పారు. సిబ్బందికి, విద్యార్థులకు 55 ఇంచీల స్మార్ట్‌ టివితోపాటు క్రీడా సామగ్రి, లైబ్రరీ బుక్స్‌ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు తయారుచేసినట్లు అధికారులు సిఎంకు వివరించారు. ఇంటర్నెట్‌ సదుపాయం ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. గురుకుల పాఠశాలల్లో మూడు విడతలుగా నాడు-నేడు పనులు చేయాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ హాస్టళ్లలో రెండు విడతలుగా చేయాలని చెప్పారు. పారిశుధ్యం, పరిశుభ్రతపైనా దృష్టిసారించాలన్నారు. డ్రెయినేజీని లింక్‌ చేయడంపైనా దృష్టిపెట్టాలని తెలిపారు. హాస్టల్‌ పిల్లలకు ఇచ్చే కాస్మోటిక్స్‌ సహా వస్తువులన్నీ నాణ్యతతో ఉండాలన్న చెప్పారు. విద్యాకానుకతోపాటు వీటిని అందించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వసతి గృహాల్లో ప్రతిరోజూ ఒక మెనూ ఇవ్వాలని చెప్పారు. క్రమం తప్పకుండా వైద్యులు హాస్టళ్లకు వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విలేజ్‌ క్లినిక్స్‌, స్థానిక పిహెచ్‌సిలతో ప్రభుత్వ హాస్టళ్లను మ్యాపింగ్‌ చేయాలన్నారు. నిర్వహణలో ఖాళీలను కూడా గుర్తించి భర్తీ చేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయాలకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసి తనకు నివేదించాలని తెలిపారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ, సాంఘిక, బిసి సంక్షేమశాఖల మంత్రులు పీడిక రాజన్న దొర, మేరుగ నాగార్జున, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్‌, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి జి జయలక్ష్మి తదితరులు పాల్గన్నారు.