Jul 05,2022 10:22

కర్నూలు : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలంతా మరోసారి ఎన్నికల్లో దిగితే దివాలా తీయడమేనని.. రైతుల్లా.. నాయకులూ ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనని కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ టిడిపి బాధ్యుడు తిక్కారెడ్డి వ్యాఖ్యానించారు.

                                 టిడిపి నేతలంతా రాష్ట్రంలో ఆస్తులు అమ్ముకున్నారు : తిక్కారెడ్డి

ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును నిరసిస్తూ సోమవారం ఉదయం మంత్రాలయం నుంచి చిలకలడోన వరకు తిక్కారెడ్డి పల్లెవెలుగు బస్సులో ప్రయాణించారు. అనంతరం చిలకలడోనలోని ఓ దుకాణంలో టీ తయారు చేస్తూ మాట్లాడారు. వైసిపి నాయకులకు జగన్‌ దేవుడు అని అన్నారు. ధర్నా చేయాలన్నా... సర్పంచి.. ఎమ్మెల్యేల ఎన్నికలకు వెళ్లాలన్నా మూటలు మూటలుగా ఇస్తారని చెప్పారు. ఈ రోజు తెలుగుదేశం నాయకులందరూ రాష్ట్రంలో ఆస్తులు అమ్ముకున్నారని ఆవేదన చెందారు. మరోసారి ఎన్నికలకు దిగితే అంతా దివాలా తీయడమేనన్నారు. రైతుల్లా... నాయకులూ ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు.

                                                 ఇక టీ అమ్ముకొని బతకాల్సిందే : తిక్కారెడ్డి

తనపై గెలిచిన బాలనాగిరెడ్డి దేవుడి చిత్రాలు తీసేసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటో పెట్టుకున్నారని తిక్కారెడ్డి చెప్పారు. ఎందుకంటే ప్రతి రోజూ గోనె సంచుల నిండా డబ్బులు సంపాదించుకుంటున్నారని అన్నారు. ఆన్‌లైన్‌ పేమెంట్‌ లేకుండా రూ.500, రూ.2 వేలు నోటిస్తేనే ఇసుక ఎత్తుతున్నారని... గుడికంబాల రీచ్‌వద్ద ప్రతి రోజు 400 లారీల ఇసుక ఎత్తి 50 బిల్లులు మాత్రమే కొడుతున్నారని ఆరోపించారు. మరో పక్క తమ పరిస్థితి ఏమిటంటే ఎన్నికలకు పొలాలు, ఆస్తులు అమ్ముకుంటున్నామని... ఇంకో ఎన్నిక జరిగితే తనకున్న ఆస్తి మొత్తం పోతుందని... ఇక టీ అమ్ముకొని బతకాల్సిందేనని తిక్కారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఈసారి కచ్చితంగా గెలుస్తామంటూ తిక్కారెడ్డి కార్యకర్తలకు భరోసానిస్తూ ఉత్సాహపరిచారు.