May 25,2023 06:46

హాయ్ నేస్తాలూ!

మా ఊరు యర్రగొండపాలెం. ఆ పేరుకు ఓ చరిత్ర ఉంది. అది ఈ మధ్య తెలుసుకున్నా. మీతో చెప్పాలనుకుంటున్నా. ప్రస్తుతం నియోజకవర్గ కేంద్రంగా ఉన్న ఎర్రగొండపాలెం పూర్వం దిగోపాలెం (దిగువపాలెం)గా పిలువబడింది. నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో దిగువగా ఉన్నందున ఎర్రగొండపాలెం గ్రామాన్ని పూర్వం దిగువపాలెంగా పిలుచుకునే వారు. వాడుకలో ఈ గ్రామానికి మరో రెండు పేర్లు ఉన్నాయి. వాటిలో ఒకటి ఎర్రగొల్లపాలెం. మరొకటి దిగువపాలెం అని.
రాచరిక పాలనాకాలంలో నల్లమల అటవీ ప్రాంతం సమీప గ్రామాల్లో ఎర్రగొల్లలు ఎక్కువగా ఉండేవారు. వారి ఆధిపత్యం కొనసాగుతున్న కాలంలో ఎర్రగొల్లపాలెంగా పిలిచేవారు. కొండకు దిగువన ఉన్న ప్రాంతాన్ని దిగువపాలెంగా పిలిచేవారు. రానురానూ ఈ ప్రాంతం అంతా కలిసిపోయింది. ఎర్రగొండపాలెం గ్రామానికి ఎర్రకొండలపాలెంగా అని పిలుస్తున్నారు. ఈ గ్రామానికి చుట్టూ ఎర్రకొండలు ఉన్న కారణంగా ఎర్రగొండపాలెం అని పిలుస్తున్నారని మరికొంత మంది అంటున్నారు. ఇది ఫ్రెండ్స్‌ మా ఊరి కథ. మరీ మీరూ మీ వూరి విషయాలు చెప్పండి.

yasin

 

 

 

 

 

 

షేక్‌ సుఫియన్‌ , 9వ తరగతి, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా .