
పెగడపల్లి : మార్కెట్ కమిటీలు రైతులకు సేవ చేస్తూ అండగా ఉండాలని, లాభసాటి పంటలు సాగేచేసేలా రైతులను ప్రోత్సహించాలని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం శనివారం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ లోక నిర్మలా మల్లారెడ్డితో పాటు సభ్యులు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతులకు సేవ చేయడానికి తప్ప రాజకీయాలు చేసేందుకు కాదన్నారు.కేసీఆర్ రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధుతో పాటు రైతుబీమా రైతు కుటుంబానికి ధీమా కల్పించడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుతో పంటలకు సాగునీరందిస్తున్నారన్నారు. పెన్షన్లు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, రైతుబంధు, మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు, 24 గంటల ఉచిత కరెంటు, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయని ప్రశ్నించారు. అధికారం ఉన్న రాష్ట్రాల్లో పథకాలు అమలు చేయడం చేతకాదని, నోరు, మైకులు ఉన్నాయని ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్, ఓరుగంటి రమణారావు తదితరులు పాల్గొన్నారు.