Aug 10,2022 08:11

ప్రజాశక్తి- ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా) : గోదావరి ఉగ్రరూపానికి వందల గ్రామాలు చిగురుటాకులా వణికిపోయాయి. ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. వరద తాకిడికి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలైన విఆర్‌.పురం, ఎటపాక, కూనవరం, చింతూరుల్లో ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి. ప్రజలు కొండలు, గుట్టలు ఎక్కి బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రాణాలు కాపాడుకోగలిగారు కానీ విలువైన వస్తువులన్నీ వరద పాలయ్యాయి. గతంలో ఎన్నడూలేని రీతిలో బురద మేటతో ఇళ్లు, వీధులు ఒక్కటయ్యాయి. వరద తగ్గాక ఎక్కడ చూసినా జంతు కళేబరాలు, దుర్గంధమే. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వ్యాధులు ప్రబలకుండా వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఏ గ్రామంలోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. దీంతో, ప్రజలు గత నెల 21 నుంచి రోగాల బారిన పడ్డారు. వేలాది మందిని విషజ్వరాలు పీడిస్తున్నాయి. పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన సిపిఎం, ప్రజాశక్తి సాహితీ సంస్థ పలు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాయి. నెల్లూరులోని రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాలకు చెందిన వైద్య బృందాలు విశేష సేవలందించాయి.
    గత నెల తొమ్మిదిన వరదలు ప్రారంభమైన నాటి నుంచే ముంపు మండలాల్లోని గ్రామాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రభుత్వాధికారులకు సమాచారం చేరవేస్తూ ప్రజలకు సహాయం అందించడంలో సిపిఎం నాయకులు మంచి కృషి చేశారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పడవల్లో ముంపునకు గురైన గ్రామాలకు వెళ్లి ప్రజలకు ఆత్మస్థైర్యం కలిగించారు. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, సిపిఎం కమిటీల ఆధ్వర్యాన భోజన కేంద్రాలు నిర్వహించారు. ప్రజలు రోగాల బారిన పడుతున్న నేపథ్యంలో ప్రజాశక్తి సాహితీ సంస్థ సహకారంతో నెల్లూరులోని డాక్టర్‌ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల వైద్యుల బృందంతో ఈ నాలుగు మండలాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ నెల ఐదో తేదీన ఎటపాక మండలం ఎర్రగట్టు కేంద్రంగా సంచార వైద్య శిబిరాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం ప్రారంభించారు. అదే రోజు నందిగామ, మురుమూరు కేంద్రాల్లో వైద్య శిబిరాలు నిర్వహించారు. ఆరున చింతూరు మండలం ఎ.జి.కోడేరు, కల్లేరు, ఏడున కూనవరం మండలం రేగులపాడు, రేపాక, ఎనిమిదిన విఆర్‌.పురం మండలం సోములగూడెం గ్రామాల్లో వైద్య శిబిరాలు నడిచాయి. వెయ్యి మందికిపైగా రోగులకు వైద్య సేవలు అందాయి. వైద్యులు, వైద్య సిబ్బంది రోగులను ఆప్యాయంగా పలకరించి, శ్రద్ధగా వారి సమస్యలు విన్నారు. జ్వరాలు, కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు, సుగర్‌, బిపి, దురద లాంటి వ్యాధులకు నాణ్యమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించారు. విలువైన సలహాలు, సూచనలు ఇచ్చి తమలో ఆత్మస్థైర్యం పాదుగొల్పినట్టు రోగులు తెలిపారు. సిపిఎంకు, ప్రజాశక్తికి, వైద్య బృందాలకు ధన్యవాదాలు తెలిపారు. నీరు కలుషితం కావడంతో ప్రజలు టైఫాయిడ్‌, మురుగు నీటి నిల్వతో దోమలు పెరిగి మలేరియా, డెంగీ జ్వరాల బారిన పడే అవకాశమున్నందున ముంపు గ్రామాల్లో రానున్న రెండు నెలలపాటు వైద్య బృందాలతో సేవలు కొనసాగిస్తామని మంతెన సీతారాం తెలిపారు.
      ఈ వైద్య శిబిరాల ఏర్పాటులో సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు తదితరులు కీలకపాత్ర పోషించారు. వరద బాధితులకు సేవలందించిన వారిలో నెల్లూరులోని రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాలకు చెందిన డాక్టర్లు ఎ.రమేష్‌, డి.సుమన్‌, సిబ్బంది వి.మోహన్‌ రెడ్డి, పివి.రమణ, జి.మల్లికార్జున్‌, ఎం.మాధవ్‌, వి.వెంకటేష్‌, ఎన్‌.విజరు, రాంబాబు ఉన్నారు.

 

011                                        మరిన్ని రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఆస్టియో ఆర్థరైటీస్‌ సమస్యలతో ఎక్కువ కేసులు వచ్చాయి. వరదల కారణంగా సామాన్లు తరలించడం కోసం ఎక్కువసేపు తిరగడం వల్ల వెన్నునొప్పి, కీళ్ల నొప్పులతో బాధపడుతూ వైద్యం కోసం వచ్చారు. ఎక్కువగా అలసిపోవడంతో జ్వరం వచ్చిన వారు ఉన్నారు. మలేరియా కేసులూ వచ్చాయి. ఇన్‌ఫెక్షన్‌ వల్ల పిల్లలు జ్వరం బారినపడ్డారు. ముంపు ప్రాంతాల ప్రజలు మున్ముందు వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. రానున్న రోజులు చాలా కీలకం. తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
                                                                                                               -డాక్టర్‌ ఎ.రమేష్‌

 

022                                                 అందరికీ మందులు పంపించాం

వైద్య శిబిరాలకు రాని వారికి కూడా రోగ లక్షణాలను బట్టి మందులు పంపించాం. బురదలో ఎక్కువగా తిరగడం వల్ల చర్మ వ్యాధులు వస్తాయి. వరదల వల్ల నీళ్లు, వాతావరణం కాలుష్యమైనందున వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. నీళ్లను వేడిచేసి చల్లారిన తర్వాత తాగడం, వేడి ఆహారం తీసుకోవడం, నీరు నిల్వ లేకుండా చూసుకోవడం, దోమ తెరలు వాడడం జీవన శైలిలో అలవాటుగా మార్చుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
                                                          -డాక్టర్‌ డి.సుమన్‌