Jul 23,2022 21:10

మూడు వారాల్లో రూ.1.60 లక్షల కోట్లు ఫట్‌
ముంబయి :
డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా పడిపోవడంతో ఆ ప్రభావం భారత విదేశీ మారకం నిల్వలపై తీవ్రంగా పడిపోతోంది. గత మూడు వారాల్లోనే దాదాపు 20.5 బిలియన్‌ డాలర్లు (రూ.1.60 లక్షల కోట్లు) మారకం నిల్వలు తగ్గిపోయాయి. వరుసగా మూడో వారం జూలై 15తో ముగిసిన వారంలో ఇవి 7.541 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.60వేల కోట్లు) మేర తగ్గడంతో మొత్తం రిజర్వులు 572.712 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గణంకాలు వెల్లడించాయి. జూలై 8తో ముగిసిన వారంలో ఇవి 8 బిలియన్‌ డాలర్లు, అంతక్రితం వారంలో 5 బిలియన్‌ డాలర్లు చొప్పున తరిగిపోయాయి. ఇటీవల డాలర్‌తో రూపాయి మారకం విలువ అమాంతం పడిపోవడం, వాణిజ్య లోటు, కరెంట్‌ లోటు పెరగడం తదితర కారణాలు మారకం నిల్వలు కరిగిపోయేలా చేస్తున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 80కి చేరడంతో రిజర్వులకు ఎసరు వస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.