Jul 03,2022 06:23

కార్మిక శక్తికి నిలయం...పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లోని నేటి సి.పి.ఐ(ఎం) పార్టీ కార్యాలయం. 1962 జూన్‌లో, ఆ ఇంట్లోనే మా సంసారం ప్రారంభమైంది. ఆ ప్రదేశం అంతా ఓ షాపుకారు తోటలో వుండేది. అప్పటి పార్లమెంటు సభ్యులు కా|| ఉద్దరాజు రామం గారు గ్రాంటు చేసిన నిధులతో ఆ తోట లోని కొంత స్థలం కొని సిపిఐ(ఎం) నాయకత్వాన చేనేత సొసైటీ కాలనీ ఏర్పడింది. కాలనీ నిర్మాణానికి మూల పురుషులు కామ్రేడ్‌ అల్లూరు సత్యనారాయణ గారు. మొత్తం తోట అంతా కొంటేనే మీకు అమ్ముతానని ఆ తోట యజమాని షరతు పెట్టారు. ఆ స్థలం రిజిస్ట్రేషను ఆగిపోయింది. కాలనీకి తోట స్థలం అంతా అవసరంలేదు. 3 నెలలు దాటితే ప్రభుత్వ గ్రాంటు రద్దయిపోతుంది. నర్సాపురం తాలూకా కమ్యూనిష్టు పార్టీ కార్యదర్శిగా 1952 నుండి పాలకొల్లు లోనే అద్దె ఇంట్లో ఉంటున్న అల్లూరు గారికి ఆ స్థలం రిజిస్ట్రేషను పెద్ద పరీక్ష అయిపోయింది. పాలకొల్లులో తనకు పరిచయస్తులను కలుసుకొని, బతిమాలి వెంటబడి ఐదారుగురుతో కొంత స్థలం కొనిపించారు. తాను కూడా కొంత స్థలం కొంటే చేనేత కాలనీ స్థలం రిజిస్ట్రేషన్‌ అవుతుందన్న ఆలోచన వచ్చింది. నా దగ్గర ఉన్న బంగారం అమ్మేసి...ఎట్లయితేనేం ఈనాటి మా ఇంటి స్థలం (500 గజాలు) కొన్నాం. అల్లూరి గారి ప్రోత్సాహంతో ఇతరుల కొన్నది కూడా 500 గజాలే. నానా తిప్పలు పడి చేనేత కాలనీ రిజిస్ట్రేషను చేయించారు. మా స్థలంలో మట్టిగోడల ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇల్లే నాకు మానవ జీవిత పరమార్ధం తెలిపిన దేవాలయం. అదే నాకు గురుకుల పాఠశాల. గొప్ప విజ్ఞాన కేంద్రం, సామాజిక సేవా మార్గదర్శిని.
చేనేత సొసైటీ కాలనీ నిర్మాణం 1964లో పూర్తయింది. చేనేత కుటుంబాలు నేత మగ్గాలతో ఆ ఇళ్లలోకి చేరాయి. నిరంతరం ఆ నేత మగ్గాల చప్పుళ్లతో, ఆ కాలనీ కళకళలాడేది. ఆ ప్రశాంత నిలయంలో రాత్రివేళ త్యాగధనుల జీవిత చరిత్రలు మార్గదర్శకం అయ్యాయి.
అది 1964 డిసెంబరు 30వ తేదీ అర్ధరాత్రి 2 గంటల సమయం. అంతకు గంట ముందే అల్లూరు గారు ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నారు. ఇంటి బయట గేటు దగ్గర నిలబడి ఎవరో 'అల్లూరు గారు' అని పిలిచారు. ఆయన లేచి గేటు బయటకు వెళ్ళారు. పోలీసు డి.ఎస్‌.పి. అరెస్టు వారంటు ఇచ్చాడు. సుస్తీగా వుండడంతో పార్టీ నేత కా|| ఉద్దరాజు రామం గారు ఇంట్లో పడుకొని ఉన్నారు. అప్పటి జిల్లా పార్టీ కార్యదర్శి నెక్కలపూడి రామారావు గారు కూడా వచ్చి అక్కడే వున్నారు. ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆ రకంగా దేశవ్యాప్తంగా 1200 మంది కమ్యూనిస్టు పార్టీ నాయకులను కాంగ్రెసు ప్రభుత్వం సంవత్సరంన్నర పాటు జైళ్లలో నిర్బంధించింది.
జైళ్ల లోనే పార్టీకి సంబంధించిన సిద్ధాంత విభేదాలు వచ్చాయి. నాయకత్వంలో పెద్ద సిద్ధాంత పోరాటం ప్రారంభమయింది. జైళ్ల నుండి బయటకు వచ్చాక, సిద్ధాంత విబేధాలు మరింత తీవ్రతరమయ్యాయి. అప్పుడే పార్టీలో నక్సలైట్‌ విధానం ప్రారంభం అయింది. ప్రియతమ నేత సుందరయ్య, బసవపున్నయ్య తదితర సిద్ధాంతకర్తలు నక్సలిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తీవ్రవాదాన్ని గట్టిగా వ్యతిరేకించారు. అది పార్టీ సిద్ధాంతం కాదు. మార్క్సిజం వ్యక్తిగత హింసావాదం కాదు. అది బందిపోట్ల విధానం అంటూ తీవ్రంగా దుయ్యబడుతూ, పార్టీ భవిష్యత్తు పట్ల చాలా ఆందోళన చెందారు. దేశ వ్యాప్తంగా పార్టీలో పెద్ద అలజడి. ఆ స్థితిలో మార్క్సిజం అసలైన విధానాన్ని చర్చించేందుకు పార్టీ నేత సుందరయ్య గారు, తీవ్ర వాదులందరితో కలిసి ప్లీనం ఏర్పాటు చేసి సుదీర్ఘంగా చర్చించి పార్టీ విధానాన్ని ప్రజాసామ్యయుతంగా నిర్ణయించాలని ప్లాను చేశారు. ఆ రాష్ట్ర ప్లీనం సమావేశం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరుపుతామని...జిల్లా పార్టీ నిర్మాత ఉద్దరాజు రామం, అల్లూరు, ఆర్‌.యస్‌ గార్లు ముందుకొచ్చారు. ఆ ప్లీనం జరపటమంటే సామాన్యమైన విషయం కాదు. ఎంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. పార్టీ భవిష్యత్తుని నిర్ణయించే సిద్ధాంత పోరాటం. ఎంతో క్రమశిక్షణ గల, అంకిత భావంతో పనిచేసే, పార్టీయే ప్రాణంగా భావించే కార్యకర్తలు కావాలి. వారే, ఆ ప్లీనం జయప్రదం కావడానికి సూత్రధారులు. ప్లీనంలో జరిగిన ఓటింగ్‌లో పుచ్చలపల్లి సుందరయ్య పార్టీ విధానమే జయప్రదం అయింది. అదే సిపిఐఎం పార్టీ కార్యక్రమం.
ముఖ్యంగా పాలకొల్లు లోని చేనేత కుటుంబాల స్త్రీ, పురుషులే పార్టీ సంపద. ఆనాటి చేనేత కార్మిక సంఘమే పార్టీకి అసలైన నాయకత్వం. కష్ట కాలంలో, పార్టీ నాయకులకు రక్షణ ఇచ్చి, కడుపులో పెట్టుకొని కాపాడిన వారి తల్లులు, బిడ్డలు, నర్సాపురం లోని పాలపర్తి పేట, దళిత కుటుంబాలు, సరిపల్లి, మత్స్యపురి పాలెం శ్రామికులు, గోదావరి తీరంలోని మత్స్య కార్మిక కుంటుంబాలు ప్రాణాలకు తెగించి పార్టీని కాపాడుకున్నాయి. ఒక్కొక్కరూ పది మంది పెట్టుగా పని చేసేవారు. వారంతా అస్తమించారు. వారి వారసులుగా వారి బిడ్డలు, మనుమలు కొంత వరకూ చదువుకొని నేటి దోపిడి వ్యవస్థను అంతం చేసి తమ బంగారు భవితను కాపాడుకోగలరని...కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని హింసాపూరితం చేస్తున్న రాక్షస పాలనను అంతం చేయగలరని ...మా తరం ఎదురు చూస్తోంది.

- అమ్మాజీ