Jul 02,2022 10:11

ప్రజాశక్తి - తెనాలి : గుంటూరు జిల్లా, తెనాలి మండలం, కొలకలూరు గ్రామ ఎస్సీ కాలనీలో డయేరియా బారినపడి, స్థానిక ఉన్న పీహెచ్సీలో చికిత్స పొందుతున్న బాధితులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని శనివారం పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలు, ఘటన వివరాలు, దానికి గల కారణాలు, తదుపరి అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డయేరియా లక్షణాలతో బాలిక గోరికపూడి శ్రీనిధి మృతి చెందటం అత్యంత బాధాకరమన్నారు. తదనంతరం నెలకొన్న పరిణామాలపై జిల్లా కలెక్టర్‌, స్థానిక శాసనసభ్యులు స్పందించి తక్షణ చర్యలు తీసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారన్నారు. ల్యాబ్‌ టెస్టులకు పంపిన నీటి శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉంది అన్నారు. బాధితులను ఆదుకోవడంలో, సకాలంలో వైద్య సేవలు అందించడంలో అధికారులు శ్రమిస్తున్నారన్నారు. మృతి చెందిన బాలిక కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు. శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్‌ మాట్లాడుతూ.. ల్యాబ్‌ టెస్ట్‌ కు పంపిన నీటి శాంపిల్స్‌లో నీరు కలుషితమైన ఆధారాలు లేవన్నారు. ఘటనకు మరేమైనా కారణాలు అంటే ఆహారంలో కాని ఇంకేమైనా ఇతర సమస్యలు ఉన్నాయా అన్నది తేలాల్సిందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి, కమిషనర్‌ ఆఫ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ జె.శ్రీనివాస్‌, పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ జాయింట్‌ డైరెక్టర్‌ మోహన్‌ కష్ణ, తెనాలి సబ్‌ కలెక్టర్‌ డాక్టర్‌ నిధి మీన, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ స్వరాజ్య లక్ష్మి, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ శోభా రాణి, ఉప జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ జి అరుణ కుమారి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.