May 25,2023 07:11
  •  ఎంఆర్‌పి కంటే అధిక ధరకు విత్తనాల విక్రయం
  •  చోద్యం చూస్తున్న ప్రభుత్వం

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : మిర్చి విత్తన కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎంఆర్‌పి కంటే అధిక ధరకు విత్తనాలను విక్రయిస్తున్నాయి. దీనిని అరికట్టాల్సిన ప్రభుత్వం చూస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కాకుండానే రాష్ట్రంలో రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఖరీఫ్‌కు సన్నద్ధం అవుతున్న రైతులు నాణ్యమైన విత్తనాల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారు. గత నాలుగేళ్లుగా మిర్చి క్వింటాలు సగటు ధర రూ.15 వేల వరకు వస్తుండడంతో రైతులు ఈ పంట సాగు పట్ల ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో మిర్చి విత్తనాల తయారీకి వ్యవసాయ, ఉద్యాన శాఖ ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. కర్ణాటక, తెలంగాణ, మహరాష్ట్ర నుంచి విత్తనాలు రాష్ట్రానికి వస్తున్నాయి. వీటి తయారీకి గరిష్టంగా కిలోకు రూ.25 వేలు ఖర్చు అవుతుండగా ఎంఆర్‌పి రూ.లక్ష నుంచి లక్షా 30 వేలు వరకూ నిర్ణయిస్తున్నారు. ఎంఆర్‌పిపై ప్రభుత్వానికి నియంత్రణ లేదని అధికారులు చెబుతున్నారు. అధిక దిగుబడి ముసుగులో ఎంఆర్‌పి కంటే అధిక ధరకు అమ్ముతున్నారు. గత కొన్ని రోజులుగా పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని పెదకూరపాడు, గురజాల, నర్సరావుపేట, తాడికొండ, పత్తిపాడు తదితర ప్రాంతాల్లో నాంథారి (డినోవా క్లాసిక్‌) కంపెనీ పది గ్రాములు ప్యాకెట్‌పై ఎంఆర్‌పి రూ.1,360 ముద్రించి ఉండగా, రూ.2 వేల వరకు విక్రయిస్తున్నారు. 2626 రకం ఎంఆర్‌పి రూ.1200 కాగా, కృతిమ కొరత సృష్టించి పది గ్రామాల ప్యాకెట్‌ రూ.2,200 వరకు అమ్ముతున్నారు. ఈ విత్తనాల వల్ల అధిక దిగుబడులు వస్తాయని రైతుల్లో నమ్మకం కలిగిస్తున్నారు. ఎకరాకు 20 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశపెడుతున్నారు. రాష్ట్రంలోని పది జిల్లాల్లో 2021లో 4.60 లక్షల ఎకరాల్లోనూ, 2022లో 5.55 లక్షల ఎకరాల్లోనూ మిర్చి సాగు చేశారు. ఈ ఏడాది ఆరు లక్షల ఎకరాల్లో ఈ పంట సాగవుతుందని అంచనా. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాల్లో మిర్చి సాగు అధికంగా జరుగుతుంది. ఎకరాకు సగటున 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ఎకరాకు పెట్టుబడి రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు అవుతోంది. అయినా, ధర ఆశాజనకంగా ఉండడంతో మిర్చి సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితిని విత్తన కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి. అధిక దిగుబడి వస్తుందని నమ్మించి కిలో విత్తనాలను రూ.2 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ విత్తనాల సరఫరాపై దృష్టి సారించలేదు. ఆర్‌బికెల ద్వారా 20 శాతం మాత్రమే సరఫరా చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రైతులు కోరుకున్న రకాల విత్తనాలు సరఫరా చేయడం లేదు. ఇందుకు సంబంధించి ఆయా కంపెనీలతో ఇప్పటి వరకు ఎటువంటి ఒప్పందాలూ చేసుకోలేదు. దీంతో, బహిరంగ మార్కెట్లో అందుబాటులో ఉన్న పలు రకాల విత్తనాల కొనుగోలుపై రైతులు దృష్టి సారించారు. విత్తన ప్యాకెట్లపై ఉన్న ధర కన్నా 30 నుంచి 40 శాతం వరకు పెంచి విత్తన కంపెనీలు విక్రయిస్తున్నాయి.

  • ఆర్‌బికెల ద్వారా సరఫరా చేస్తాం

మిర్చి సాగుకు ఇంకా సమయం ఉన్నందున రైతులు తొందరపడి అధిక ధరకు మిర్చి విత్తనాలు కొనుగోలు చేయవద్దని పల్నాడు జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఐ.మురళీ సూచించారు. రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలను అందుబాటులో ఉంచుతామన్నారు. ఆర్‌బికెల కోసం ఇప్పటికే 300 కిలోల విత్తనాలకు ఇండెంట్‌ పెట్టామని చెప్పారు. ఎంఆర్‌పికే ఆయా కంపెనీల విత్తనాలు ఆర్‌బికెల ద్వారా అందిస్తామని గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎన్‌.వెంకటేశ్వర్లు తెలిపారు. అధిక ధరలపై రైతుల నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదులూ రాలేదని చెప్పారు.