
సోన్‌భద్ర (ఉత్తరప్రదేశ్) : ఉత్తరాది రాష్ట్రాల్లోని వేడుకల్లో ఫైరింగ్ అనే ప్రమాదకర ఆనవాయితీ కొనసాగుతుంది. ప్రమాదం అని తెలిసినా సెలెబ్రెటరీ ఫైరింగ్ ఆగడం లేదు. ఈ సరదా ఒక్కోసారి ప్రాణాలను తీస్తోంది. ఇటీవల ఓ పెళ్లి వేడుకలో పెళ్లి కొడుకు చేసిన సెలెబ్రెటరీ ఫైరింగ్‌కు ఓ యువకుడు బలి అయిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని సోన్‌భద్ర జిల్లా బ్రహ్మనగర్‌లో చోటుచేసుకుంది.
బాబూలాల్ ఆర్మీలో జవాన్‌గా పనిచేస్తున్నాడు. సెలవులు కావడంతో సొంతూరుకు వచ్చిన బాబూలాల్ తన స్నేహితుడైన మనీష్ మధేషియా పెళ్లికి వెళ్లాడు. పెళ్లి కొడుకు మనీష్‌కు తన గన్ ఇచ్చాడు. పెళ్లి ఊరేగింపులో రథంపై ఉన్న పెళ్లికొడుకు తుపాకీతో కాల్పులు జరిపాడు. అయితే ఆ బుల్లెట్ మిస్‌ఫైర్ అయ్యి కింద ఉన్న పెళ్లికొడుకు ఫ్రెండ్ బాబూలాల్ యాదవ్‌కు తగలడంతో వెంటనే యువకుడు కుప్పకూలిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాబూలాల్‌ను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే అతను మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మనీష్‌ను అరెస్టు చేశారు.
దీనిపై సోన్‌భద్ర ఎస్పీ అమరేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ .... యువకుడి గన్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. లైసెన్స్ ఉన్నా సరే సెలెబ్రెటరీ ఫైరింగ్ పేరుతో కాల్పులు జరపడం నేరమేనని స్పష్టం చేశారు.