Oct 05,2022 15:27

సియోల్‌: ఉత్తరకొరియా దుందుడుకు చర్యపై జపాన్‌, దక్షిణకొరియా, అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఈ నేపధ్యంలో ఉత్తరకొరియా మంగళవారం ఏకంగా జపాన్‌ మీదుగా ఓ బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది.ఈ క్షిపణి తమ దేశ ఉత్తర ప్రాంత ద్వీపం హొక్కారుడో రాజధాని సప్పొరో నగరానికి సమీపంలో పసిఫిక్‌ సముద్రంలో పడినట్లు జపాన్‌ తెలిపింది. ఈ క్రమంలో హొక్కారుడో, అమోరి ప్రాంతాలకు మంగళవారం ఉదయం రైళ్లను నిలిపివేసింది. 2017 తర్వాత తొలిసారి ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది. ఉత్తర కొరియా ప్రయోగించిన ఈ క్షిపణి.. 4,500 నుంచి 4,600 కి.మీ. ప్రయాణించినట్లు దక్షిణ కొరియా, జపాన్‌ అంచనా వేశాయి. అమెరికా అధీనంలోని గువామ్‌ ద్వీపం, పరిసర ప్రాంతాలను అణ్వాయుధాలతో ఈ క్షిపణి తాకగలదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తీవ్ర రెచ్చగొట్టే చర్యగా దీనిని అభివర్ణిస్తున్నారు. ఈ క్షిపణి ప్రయోగంతో జపాన్‌కు నష్టం వాటిల్లిన సమాచారమేదీ వెల్లడి కాలేదు.