Mar 18,2023 14:51

హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పినే ధ్యేయమని, మే నాటికి మన బస్తీ - మన బడి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. నారాయణగూడలోని కేశవ మెమోరియల్‌లో మన బస్తీ -మన బడి పనులపై శనివారం మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి.. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందజేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని తెలిపారు.
మన బస్తీ - మన బడి పథకం అమలు కోసం రూ.7289 కోట్లు మంజూరు చేశారని మంత్రి తలసాని పేర్కొన్నారు. ఈ పథకం మొదటి విడతలో భాగంగా హైదరాబాద్‌లోని 239 పాఠశాల్లోల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా పాఠశాలల అభివృద్ధికి ఇంత మొత్తంలో నిధులు కేటాయించలేదని అన్నారు. అలాగే బిల్లులు చెల్లించలేదనే కారణంతో ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయకుండా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో హౌంమంత్రి మహమూద్‌ అలీ, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కాలేరు వెంకటేశ్‌, నగర మేయర్‌ విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.