Aug 09,2022 20:45

ప్రజాశక్తి-గన్నవరం (కృష్ణా జిల్లా) :ఇంటింటికీ జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధాని మోడీ పిలుపునివ్వడం భారత ప్రజలను మరోసారి మోసం చేయడమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. 'దేశ స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, మతతత్వం నిరంకుశత్వంపై పోరాటం చేద్దాం' అనే అంశంపై కృష్ణా జిల్లా గన్నవరంలోని రాయనగర్‌ క్లబ్‌లో సిపిఎం గన్నవరం మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సభ నిర్వహించారు. పార్టీ మండల కార్యదర్శి మల్లంపల్లి ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన సభలో శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గని మాట్లాడారు. ఇంటింటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని చెప్పే అర్హత మోదీకి లేదన్నారు. అది ఒక్క కమ్యూనిస్టులకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. జాతీయోద్యమంలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. అందుకే జాతీయ జెండాను ఎగుర వేసేందుకు ప్రచార ఉద్యమం చేపట్టామన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాక ప్రతి పని కార్పొరేట్ల కోసమే చేస్తున్నారని విమర్శించారు. ఆదానీ, అంబానీలకు అమృతం పంచిపెడుతూ పేదలకు విషయం పంచుతున్నాడని తెలిపారు. స్వాతంత్ర ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి పాత్ర లేదని, 2002 వరకూ బిజెపి జాతీయ జెండాను పట్టుకోలేదని అన్నారు. అయితే అంతా తామే అన్నట్లుగా మోడీ ప్రచారం చేసుకుంటున్నారని, దేశ చరిత్రను హిందూ మతం వైపు తిరగ రాయడానికి కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఈ వాస్తవాలను ప్రజలకు తెలియజేసి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడానికి కమ్యూనిస్టులు కంకణం కట్టుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రధాని మోడీ అడుగులకు మడుగులత్తుతున్నారని, రాష్ట్రాన్ని కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మోడీ కుట్రలను జగన్‌ గమనించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం కఅష్ణా జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు, నాయకులు కళ్ళం వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.