Sep 17,2023 06:30

రాజకీయ ప్రత్యర్థులను దెబ్బకొట్టడానికి ఇంకా చెప్పాలంటే వారి...దాడినీ ధాటినీ తట్టుకోవడానికి ఎప్పుడు ఏ అస్త్రం దొరికితే దాన్ని ప్రయోగించడం గొప్ప వ్యూహంగా, సమర్థనీయంగా చలామణి చేస్తుంటారు పాలక నేతలు, మీడియా పండితులు. ప్రతిపక్ష 'ఇండియా' వేదిక సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికే పుట్టిందని ప్రధాని నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచార సభలో ప్రకటించడం అలాంటిదే. ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలతో రగులుతున్న ఈ వివాదం నిజానికి మోడీ ప్రాథమిక విధానం, నినాదం. ఆ మాట చెప్పడానికి తిలక్‌నూ గాంధీజీని, వివేకానందుడినీ అడ్డు పెట్టుకోవడం అలాంటి కుటిల నీతి. ఎందుకంటే భారత రాజ్యాంగం 20వ శతాబ్దపు రాజకీయ పత్రమే తప్ప సనాతన ధర్మ పునరుల్లేఖన కాదు. అంతెందుకు మోడీజీ ప్రధానిగా దానిపైన లేదా భగవంతుడిపైన అంత:కరణపైన ప్రమాణం చేయగలరే గాని సనాతన ధర్మంపైన ప్రమాణం చేసే అవకాశమే లేదు. భగవాన్‌ అని ప్రమాణం చేసినప్పుడు కూడా ఫలానా సనాతన మత విశ్వాస దేవుడిపైన అనే పరిస్థితి అంతకన్నా లేదు. ఇదే ప్రమాణం ఒక సిక్కు లేదా ముస్లిం లేదా క్రైస్తవ ప్రజా ప్రతినిధి చేసినప్పుడు అది వారి దేవుడు లేదా విశ్వాసం ఏదైనా కావచ్చు. మరో హేతువాది చేస్తే అంత:కరణతో ఆగొచ్చు...రాజ్యాంగమే సనాతన ధర్మాన్ని కొలబద్దగా ఎప్పుడో తిరస్కరించింది. కనుక ఇందుకు పెద్ద చర్చ అవసరమే లేదు. ఇక గాంధీజీ, తిలక్‌ వంటి వారి వారసత్వాన్ని మోడీ ప్రస్తావించడం విషయానికి వద్దాం. నిజంగా తిలక్‌ మహాశయుడు గాంధీకన్నా ముందు తరంలో అగ్ర నాయకుడు. కార్మికులను సంఘటిత పరిచినవాడు. ఆయన అరెస్టుపై ముంబయి కార్మికులు సమ్మె చేస్తే లెనిన్‌ అభినందిస్తూ లేఖ రాశారు. తిలక్‌ గణేష్‌ ఉత్సవాలను దేశభక్తి రగిలించేందుకు ఉపయోగించారు. భగవద్గీత తనను కర్తవ్య నిర్దేశానికి ఉత్తేజపరిచిందని చెప్పారు. కానీ ఎక్కడా ఆయన కులాల వివక్షను సమర్థించిన దాఖలాలు లేవు. గాంధీజీ కూడా అంతే. పైగా గీతలో చెప్పిన చాతుర్వర్ణ సిద్ధాంతానికి తనవైన భాష్యాలు చెప్పిన గాంధీ అస్పృశ్యత నివారణ ఉద్యమం ఒక గొప్ప లక్ష్యంగా చేసుకున్నారు. సంస్కరణ కోణంలో మరుగుదొడ్లు శుభ్రపరిచే కార్యక్రమం, దళితుల ఆలయ ప్రవేశం వంటివి స్వాతంత్య్ర పోరాటంలో కీలక భాగంగా చేశారు. సనాతన ధర్మం మార్చాల్సిన అవసరాన్ని ఆ విధంగా ఆచరణలో చూపించారు. భగత్‌ సింగ్‌ ప్రవేశానికి ముందు జాతీయ సాయుధ విప్లవవాదులు దుర్గాదేవి ముందు ప్రతిజ్ఞ చేస్తుంటే దాన్ని మార్పించారు. ఇందులో ఎక్కడా సనాతన ధర్మ ప్రసక్తి లేదు. స్వాతంత్య్ర పోరాటం తప్ప.

మోడీ మాట, మార్గం వేరే

స్వాతంత్య్రం కన్నా సనాతన ధర్మం ఇంకా చెప్పాలంటే హిందూ మతమే ముఖ్యమని భావించడం వల్లనే మోడీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ అందుకు దూరంగా వుండిపోయింది. అందుకు ముస్లిం వ్యతిరేకత ప్రధాన ప్రేరణ అయ్యింది. మత సామరస్యం బోధించిన గాంధీజీ ఆగర్భశత్రువు అయ్యాడు. రామ నామ స్మరణ చేస్తూనే గాంధీజీ ప్రాణం విడిచాడని చెబుతున్న మోడీ ఆయన మామూలుగా చనిపోయినట్టు మాట్లాడటం దారుణం. జీవితమంతా రామ నామ స్మరణ చేసిన గాంధీజీ గాడ్సేకు సనాతన వ్యతిరేకిగా కనిపించాడు గనక దారుణంగా కాల్చి చంపేశాడు. అది కూడా ప్రార్థన చేయబోతుండగా ఆపేసి మరీ చంపాడు. మోడీ అన్నట్టు గాంధీజీ రామ నామ స్మరణతో ఆగలేదు మరి! ఈశ్వర్‌ అల్లా తేరేనాం అన్నారే? సనాతన ధర్మం కన్నా పరమత ద్వేషం ఎక్కువైన గాడ్సే ఎలా సహిస్తాడు? ఆయన గురువైన వినాయక్‌ దామోదర్‌ సావర్కార్‌ చెప్పింది అదే కదా. గాంధీ, తిలక్‌ పేర్లు చెప్పే ప్రధాని ఈ వాస్తవాన్ని ఎందుకు మరుగు పరుస్తున్నారు? బిజెపి నేతలు గాడ్సే దేశభక్తి గురించి మాట్లాడటం, సావర్కార్‌ను పోటీ జాతిపితగా పార్లమెంటులో ప్రతిష్టించడం యాదృచ్ఛికం కాదు. ఈ మత ద్వేష భావన కారణంగానే ఉదయనిధి స్టాలిన్‌ మాటలు అంత తప్పుగా కనిపిస్తున్నాయి. నిజానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత భోజన పథకం సందర్భంగా ఒక దేవాలయంలో వివక్ష చూపి దళితులను రానివ్వకుండా దౌర్జన్యం చేసిన ఘటన ఆయనతో ఈ మాటలనిపించిందని తెలుస్తున్నది.
సనాతనం అంటే ఏమిటి? పురాతనం అంటే పాతది. అధునాతనం అంటే ఆధునికమైంది. కానీ సనాతనం అంటే శాశ్వతత్వం లాంటిది. అనాది. కృష్ణ్ణుణ్ణి పూజించేప్పుడు సనాతన అనే పదం కూడా వాడతారు. ఆ కృష్ణుడు కూడా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే అన్నాడే గాని శాశ్వతంగా ఒకటే వుంటుందనలేదు. అసలు ధర్మమంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని కర్తవ్యం చెప్పాడు. దుష్టం అంటే మనుషులే కాదు పద్ధతులు కూడా. ఆచారాలను పాటించాలనుకున్నా అన్నీ మంచివి కావు, దుర్మార్గమైనవి వున్నాయి గనకే దురాచారాలు అన్నారు. వివేకానందుడిని ఉటంకించిన మోడీజీ ఆయన మతాల మధ్య, శాఖల మధ్య విభేదాలు ఎంత విపత్కరమో చెప్పిన మాట దాటేశారు. విజ్ఞాన శాస్త్రంలో పురోగమనం లేకుండా మూఢాచారాల వెంట పరుగుపెట్టడం వల్లనే భారత దేశం వెనకబడిపోయిందని వివేకానందుడే చెప్పాడు. ఆయనను కూడా తమ జాబితాలో చేర్చుకుంది సంఘ పరివార్‌. మోడీ అదే చేశారు. ఇక మరీ కీలకమైంది రాజారామ్మోహనరారు వారసత్వం. దేశ పునరుజ్జీవనంలో అగ్రగణ్యుడైన రామ్మోహన్‌రారు సతీసహగమనంపై వీరోచితంగా పోరాడారే గాని సనాతనమని నెత్తిన పెట్టుకోలేదు. దురాచారాల దురాగతాలను తుదముట్టించిన అగ్ని తరంగం వీరేశలింగం కూడా అదే కోవ. ఈ స్వాతంత్య్ర యోధులు, సంస్కర్తల్లో ఎవరైనా సనాతనం గొప్పదని చెప్పారేమో దేశాధినేత చూపించగలరా? 'భూతకాలపు సరీసృపాలను/ పాత రాతియుగంలో పాతెరు' అన్న శ్రీశ్రీ మాటలను నిజం చేశారు. 'రాజు కట్టిన కోట/ రాణి మెట్టిన తోట/ జిల్లేడు మొలచిందిలే/ పల్లేరు పాకిందిలే అని తొలినాటి సంద్రాలు ఇంకిపోతున్న వైనాన్ని చూపారు (పురిపండా అప్పలస్వామి). వెనకబడితే వెనకేనోరు అని గురజాడ అంటే పదండి ముందుకు అని శ్రీశ్రీ పరిగెత్తించారు. ఆ సంస్కర్తల ఆశయ రంగం నీవు నిలిచిన ఈ సంఘం అని నారాయణరెడ్డి వంటి వారు గానం చేశారు. కాలం ముందుకు పోతుంది తప్ప వెనక్కు నడవదు. అనుమానమున్నవారు గడియారం చూసి తెలుసుకోవచ్చు. ముల్లు వెనక్కుపోదని. ఏ సనాతనం అంటూ శాశ్వతంగా వుండదని. అర నిమిషం గడిచేసరికదే నాకు గత శతాబ్ది అన్న మహాకవి మాట అదే. సంఘ సంస్కరణ, స్వాతంత్య్ర పోరాటం, సామ్యవాద భావజాలం త్రివేణీ సంగమంలా ఈ దేశ ప్రజల వికాసానికి, విముక్తికి బాట వేశాయి. చంద్ర మండలానికి పయనించే స్వావలంబనకు కారణమైనాయి. ఇస్రో శాస్త్రజ్ఞులు వ్యక్తిగతంగా పూజలు చేసి వుండొచ్చు గానీ అది కూడా విమర్శలను ఎదుర్కొన్నది.

చందమామపై చంద్రమౌళి పేరా?

బిజెపి ఎం.పి జివిఎల్‌ నరసింహారావు నాతో ఒక టీవీ చర్చలో ఇస్రో వారి పూజలు సనాతనానికి ఆమోదంలాగా చెప్పడం హాస్యాస్పదమైంది. అయితే అందులోనూ మరో విడ్డూరముంది. పురాణాలు ఈశ్వరుణ్ణి చంద్రమౌళిగా అభివర్ణించాయి. అంటే తలలో చంద్రుడు కలిగివున్నాడని. కాని మానవ చోదిత నౌక ద్వారా చంద్రునిపై దిగిన స్థలానికి మోడీ శివస్థల్‌ అని నామకరణం చేస్తారు. తలపై వున్నవారు కాలూనడం ఏమిటి? ఇక్కడేమన్నా పొంతన కనిపిస్తుందా? పైగా దేశం తరపున జరిపిన ప్రయోగాన్ని ఒక మతానికే ఎలా ఆపాదిస్తారు? సనాతనం పేరిట హిందూత్వను రుద్దడమే ఇక్కడ రహస్యం. ఇంతకూ సనాతనంలో హిందూత్వ పదం వుందా? సావర్కార్‌ దాన్ని 1927లో కదా కనిపెట్టింది? అంతా రాజకీయమే. కసిరి బుసకొట్టునాతని గాలి సోక నాల్గు పడగల హైందవ నాగరాజు అని గుర్రం జాషువా హెచ్చరించింది అందుకే, మోడీ సనాతన సమర్థనలో రాజకీయ కోణమదే. మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో దాన్ని రెచ్చగొట్టడానికే ఆయన ఈ ప్రస్తావన తెచ్చారు. దాన్ని సూటిగా తిరస్కరించకపోతే దేశంలో ప్రజాస్వామ్యం, సామాజిక చైతన్యం, మానవత్వం వంటి మాటలకు అర్థమే వుండదు. రాజకీయంగా నేరుగా ఖండించడం నష్టమని సన్నాయి నొక్కులు నొక్కే కొందరు మేధావులు దాన్ని నిరాఘాటంగా అనుమతిస్తే మరెంత ఘోరం జరుగుతుందో తెలుసుకోలేని అజ్ఞానంలో చిక్కుకున్నారు. పరోక్షంగా ఆ శక్తులకు పావులవుతున్నారు మోడీని విశ్వగురువుగా కీర్తించేవారు. ఈ మధ్యనే ఆయన కోరి నెత్తునెత్తుకున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ కూడా ఢిిల్లీలో జరిపిన చర్చలలోనూ మానవ హక్కుల రక్షణ గురించి క్లాసు పీకారంటే ఏమనాలి? ఇక్కడ చెప్పకుండా వియత్నాంలో మీడియాకు ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ఇక అమెరికాలో మత స్వాతంత్య్రా పరిరక్షణకు పనిచేసే యుఎస్‌సిఆర్‌ఎఫ్‌ నేరుగానే భారత దేశంలో మత స్వాతంత్య్రంపై దాడులు జరుగుతున్న పరిస్థితిని ప్రస్తావించింది. మత మార్పిడి నిషేధం, గోరక్షణపై వివాదాలు-బిల్లులు, పౌరసత్వ చట్టాల సవరణలు, స్వచ్ఛంద సంస్థలపై మత కోణంలో ఆంక్షలు వంటి పరిణామాలను కూడా పేర్కొంది. ఇండియాను ప్రత్యేకంగా ఆందోళన కలిగించే దేశంగా పరిగణించాలని సిఫార్సు చేసింది. ఇతరులకు నీతులు చెప్పే హక్కు అమెరికాకు వుందా అనే ప్రశ్న ఒకటైతే పెరిగిన విద్వేష వాతావరణం అంతర్జాతీయంగా భారతీయులకు తలవంపులు తెస్తున్న వాస్తవం మాత్రం నిజం. వివేకానందుడు అమెరికా లోని చికాగో లోనే దేశ ఔన్నత్యాన్ని చాటి సామరస్య సందేశం ఇస్తే మోడీ సర్కారు ఆ వారసత్వాన్ని తలకిందులు చేస్తున్నది. దీన్ని విమర్శనాత్మ కంగా ఎదుర్కొనకుండా సన్నాయి నొక్కులు నొక్కితే ప్రయోజనం వుండదు. ఆలోచనాపరులందరికీ శాంతి ప్రియతములందరికీ ఇది నేటి కర్తవ్యం.

'ఇండియా'కు ఆపాదించనేల?

చివరగా రాజకీయ కోణానికి వస్తే డిఎంకె నాయకుడైన జూనియర్‌ స్టాలిన్‌ మాట్లాడిన దానిపై 'ఇండియా' వేదికలో రకరకాల అభిప్రాయాలు వుండొచ్చు. ఉదాహరణకు 'ఆప్‌' ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తాను సనాతనవాదాన్ని సమర్థిస్తానన్నారు. ఈ విషయంలో ఏ విధమైన తీర్మానాన్ని గాని విధానాన్ని గాని ప్రకటించింది లేదు. మత సామరస్యం కోసం మతోన్మాదానికి వ్యతిరేకంగా పనిచేయడం అన్న ఆశయం లౌకిక పక్షాలను ఈ వేదికపై కలిపింది, సమస్యలు పరిష్కరించుకుంటూ సీట్ల పంపిణీపై అవగాహన దిశలో నడుపుతున్నది. ఈ కార్యాచరణే బిజెపిని, మోడీని భయపెడుతున్నది. అందుకే ప్రతిపక్షాలు సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటున్నాయని అస్త్రం వదిలి మతపరమైన విభేదాలు పెంచాలనుకుంటున్నారు. మత చాందసాలను, మూఢనమ్మకాలను, దురాచారాలను తప్పక వ్యతిరేకించాల్సిందే గాని ఏ మత విశ్వాసంపైన 'ఇండియా' దాడి చేసే ప్రసక్తి వుండదు. ప్రతిపక్షాల, లౌకిక పార్టీల సమైక్య కదలికతో హడలెత్తిన మోడీ వేసిన పాచిక ఇది. దురాచారాలతో పాటు ఈ దుస్తంత్రాలను కూడా తిప్పికొట్టి ముందుకు సాగడమే ఇందుకు సరైన సమాధానమవుతుంది. ఈ దేశ ప్రజలూ ఆ విధమైన సమాధానమే ఇస్తారని ఆశించాలి.ravi

 

 

 

 

 

తెలకపల్లి రవి