Jul 03,2022 20:32

- అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత ప్రధానికి లేదు
- విశాఖ, ఏలూరులో నిరసనలు
ప్రజాశక్తి - విశాఖ/ ఏలూరు కల్చరల్‌ :
ఎపికి తీవ్ర ద్రోహం చేసిన మోడీకి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదని వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు అన్నారు. మోడీ రాకను ప్రజలంతా వ్యతిరేకించాలని కోరారు. రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసిన ప్రధాని మోడీకి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదంటూ ఏలూరు, విశాఖ జిల్లాల్లో ధర్నాలు చేశారు. 'మోడీ గో బ్యాక్‌' అంటూ నల్ల జెండాలతో నిరసనలు తెలిపారు. విశాఖలోని మద్దిలపాలెం, ఆరిలోవ టిఐసి పాయింట్‌ జంక్షన్లలో సిఐటియు, ఐద్వా, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, పిఎన్‌ఎం ఆధ్వర్యంలో ధర్నాలో చేశారు. ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ మాట్లాడుతూ 'విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు' నినాదంతో పోరాడి సాధించుకున్న స్టీల్‌ప్లాంట్‌ను మోడీ అమ్మకానికి పెట్టడం దుర్మార్గమన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరానికి నిధులు వంటి హామీలను నెరవేర్చకుండా రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేశారన్నారు. గిరిజన హక్కుల కోసం అల్లూరి పోరాడితే ఆయన ఆశయాలను తుంగలోకి తొక్కి అటవీ సంపదను కార్పొరేట్లకు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. మోడీ రాకను నిరసిస్తూ నగరంలో అన్ని ప్రాంతాల్లో నిరసనలు తెలియజేయాలని కోరారు.
ఏలూరు జ్యూట్‌ మిల్లు సెంటర్‌లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి డేగ ప్రభాకర్‌, సిపిఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. గిరిజన హక్కులను, అటవీ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతూ అల్లూరి ఆశయాలకు తూట్లు పొడుస్తున్న మోడీ సర్కార్‌కు ఆయన జయంత్యుత్సవాలు చేసే అర్హత లేదన్నారు. భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు వస్తున్న మోడీ పర్యటనను అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. మోడీ రాకను వ్యతిరేకిస్తూ వేలేరుపాడు అంబేద్కర్‌ కూడలిలో నిరసన తెలిపారు. అనంతరం గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ధర్ముల రమేష్‌ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. సదస్సులో సిపిఎం జిల్లా నాయకులు మడివి దుర్గారావు, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ఎమ్‌డి మునీర్‌ మాట్లాడారు.