
- ఎపిఆర్‌పిఎ రాష్ట్ర మహాసభలో ఎఐసిసిఇపిఎఫ్‌పిఎ జాతీయ ప్రధాన కార్యదర్శి ధర్మజన్
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి :కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ అనుసరిస్తోన్న విధానాల కారణంగా దేశంలో ఇపిఎఫ్ పెన్షనర్లకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆలిండియా కో-ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఇపిఎఫ్ పెన్షనర్ల అసోసియేషన్ (ఎఐసిసిఇపిఎఫ్‌పిఎ) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ధర్మజన్ అన్నారు. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (ఎపిఆర్‌పిఎ) 2వ రాష్ట్ర మహాసభ ఆదివారం కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలోని పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ కన్వెన్షన్ హాల్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఎపిఆర్‌పిఎ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ఎ.శాస్త్రి అధ్యక్షత జరిగిన సభలో కేరళ రాష్ట్రం నుంచి వచ్చిన ధర్మజన్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇపిఎఫ్ పెన్షనర్ల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణితో ఉందన్నారు. ఒక పక్క కార్పొరేట్లకు రాయితీలు కల్పిస్తూ సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. వివిధ రకాల పన్నుల పేరుతో పేదల నడ్డి విరుస్తోందన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని తక్షణమే అధికారం నుంచి గద్దె దింపాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఆలిండియా ఉపాధ్యక్షుడు అతుల్ దిగే, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి.అజరు కుమార్, ప్రధాన కార్యదర్శి కె.సుధాకర్‌రావు, కోశాధికారి సిహెచ్.సత్యనారాయణ రాజు, రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం తదితరులు మాట్లాడారు. పెన్షన్ ఎవరి బిక్షా కాదని, ఉద్యోగుల హక్కు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.9 వేలు ఇస్తున్నందున, ఇపిఎఫ్-95 పెన్షనర్లకూ ఇదే మాదిరిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నూతన పెన్షన్ స్కీమ్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే పునరుద్ధరించాలని కోరారు. రెండు సంవత్సరాల వెయిటేజీ, భార్యాభర్తలకు కూడా మెడికల్ సౌకర్యం కల్పించాలని, ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక
మహాసభ సందర్భంగా నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్‌ఎస్.శాస్త్రి, ప్రధాన కార్యదర్శిగా కె.సత్తిరాజు, కోశాధికారిగా సిహెచ్.సత్యనారాయణరాజులతోపాటు 44 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పడింది. ఇపిఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.9 వేలు మంజూరు చేయాలని, హయర్ పెన్షన్ ఆప్షన్‌ను అందరి పెన్షనర్లకు అనుమతించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి డిఎలు చెల్లించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ సంఘాలను నియమించాలని, వృద్ధులకు ప్రయాణాల్లో రాయితీలు కల్పించాలని తీర్మానాలు చేశారు.