Jun 27,2022 07:46

అమ్మల గన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ..
సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ...
అమ్మల పరంపరకు పోతన చిత్రణ ఇది. సురాసుర వైరం మీదనే రాయబడ్డ మన పురాణాల్లో దుర్గమ్మను వర్ణిస్తూ, రాక్షసుల తల్లి కూడా బిడ్డల కోసం విలపిస్తుందని చెబుతున్నాడు. తిక్కన ఇలాగే చెప్పాడు. ఉప పాండవులను ప్రతీకారంతో హతమార్చిన ఆశ్వథ్థామ ముందు తన బాధ వెళ్లగక్కాక త్వరగా విడిచిపెట్టండి, నాలాగే మరో తల్లి ఏడ్చే పరిస్థితి తీసుకురాకండి అంటుంది.
ఇవన్నీ పురాణాలనుకుంటే ఆధునిక చరిత్రలోనూ మహావీరులు నేతలూ యోధులూ కవులూ కళాకోవిదులూ అమ్మమలచిన శిల్పాలే. వారందరికీ తొలి గురువు అమ్మే. ధైర్యం అమ్మే. మహా కవులూ, రచయితలూ అక్షరాలతో ఆ అమ్మ బొమ్మకట్టిన వారే. గురజాడ కన్యాశుల్కంలోనూ, పూర్ణమ్మలోనూ కూడా అమ్మలే బిడ్డ తరపున ధైర్యంగా నిలబడతారు.
'నా జనని గర్భంలో ఆకారం లేకుండా నిద్రిస్తున్న నా అహంకారానికి ఆశలు కొల్పిన నాడో' అంటాడు శ్రీశ్రీ. కవిత్వాన్ని 'జననీ' అని సంబోధిస్తాడు. 'వైద్యశాలలో అపుడే ప్రసవించిన శిశువు నెడద నిడుకొని రుచిర స్వప్నాలను కాంచే జవరాలి మన్ణప్రపంచపు టావర్తం' చూపిస్తాడు. పల్లెటూల్లో తల్లికేదో పాడుకలలో పేగు కదిలింది అని బాటసారిని వర్ణిస్తాడు. ఎన్ని చోట్ల అమ్మ గురించి రాసినా తృప్తి తీరక 'పుడమితల్లికి పురిటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి' అంటాడు. మాగ్జీం గోర్కి ఏకంగా అమ్మ పేరిటే నవల రాశాడు. తన బిడ్డ పావెల్‌ కొత్త చైతన్యం పెంచుకుని రహస్యోద్యమం నిర్మిస్తుంటే మొదట సందేహించి తర్వాత గాభరా పడి ఆ తర్వాత తనే అరుణ కిరణమవుతుంది. ఈ పయనాన్ని న్యాయస్థానంలో వివశంగా ఆవేశంగా వినిపిస్తుంది.
ఇంతటితో తృప్తి తీరని గోర్కి ఏకంగా ఒక ప్రసవాన్ని వర్ణిస్తాడు. తన దృష్టిలో పాత సమాజం అమ్మ. ఇది దేశమేదైనా కాలమేదైనా ఒక విధంగా ఇంటింటా జరిగేది. తల్లి వేరు నుంచే మొక్క మాను రావాలి. పుట్టకముందే తల్లితో మొదలవుతుంది జీవుల సంబంధం. మానవ మహానుబంధం. బిడ్డను ప్రోత్సహించడం, ఓదార్చడం తన తొలి చర్య. దినచర్య. చాలామంది తల్లులకు పిల్లలు తప్ప వేరే ప్రపంచం ఉండదు. విజయంలోనూ విచారంలోనూ అమ్మ ఉన్నట్లే అనుకుంటారు. బిడ్డలు విజ్ఞులైైతే అమ్మ ఆభినందిస్తుంది. విజయమైతే ఆనందిస్తుంది, విచారాలు వివాదాల్లో సాంత్వననిస్తుంది. తనకెన్ని బాధలున్నా సరే, బిడ్డలు పెరిగి తమకంటూ తమ ప్రపంచం సృష్టించుకున్నాకా అందులో ఆమె ప్రత్యేక స్థానంలో ఉంటుంది. పెద్ద చదువులు చదివిన, పెద్ద పదవులు నెరిపిన వారి తల్లుల్లో చాలామంది అమాయకంగా అనామకంగా ఉంటారు. కుటుంబాన్ని లోకాన్ని కూడా ఎదిరించి శ్రమచేసి చదివిస్తారు. ఉరుకులూ పరుగుల
ఉద్యోగినులనుంచి, బిడ్డల ఫీజుల కోసమే ఇళ్లలో పనిచేసే వారి వరకూ; రైతమ్మల నుంచి నాట్లు వేసే కూలీల వరకూ ఈ వరసలో ఉంటారు.
భర్త తాగి వచ్చి కొడుతున్నా బతిమాలి బామాలి పోరాడి పిల్లలను కాపాడుకుంటారు. ఎందరో అమ్మలు ప్రసవంలోనే కన్ను మూసినా బిడ్డలను లోకానికి అప్పగించిపోతారు. వారిని ఎవరో ఒకరు స్వంత బిడ్డల్లానే పెంచుతారు. ఆ విధంగా చూస్తే కన్నతల్లులే గాక ప్రేమమూర్తులైన మహిళలందరూ అమ్మలే. అమ్మ నాన్న బాధ్యతలు రెండూ నిర్వహించే ప్రేమమూర్తులకూ ఇది మరింత వర్తిస్తుంది.
గోర్కి నవలలో అమ్మలాగే బిడ్డలు కొత్త బాట తొక్కినపుడు అర్థం చేసుకునే వరకూ ఆందోళన చెందుతారు. అవగాహన పెరిగాక తామూ అదే బాట నడుస్తారు. బిడ్డల పక్కన నిలుస్తారు. పేద తల్లులు సయితం బిడ్డలను సేవాధర్మం వైపు నడిచేందుకు ప్రేరణనిస్తారు. పెద్ద కుటుంబాల్లోనైతే భర్తలకు తెలియకుండా కూడా మంచి పనులకు, ఉద్యమాలకూ సహాయపడతారు. సేవలో నిమగమైన వారందరినీ బిడ్డలుగానే చూస్తారు. అందరికీ అమ్మలవుతారు. ఏ ఉద్యమంలోనైనా, విప్లవంలోనైనా, కార్యక్రమంలోనైనా ప్రేమగా ఆదరించి ముద్దపెట్టే అమ్మ కనిపిస్తే ఆ స్పందనే వేరు.
ఈ సంకలనం మన చేతుల్లోకి రావడానికి కారణమైన అమ్మ గున్నమ్మ గారు అలాటివారే. ఆమె పెద్ద కొడుకు, మా చిరకాల మిత్రుడు చీకటి దివాకర్‌ వినూత్న యోచనకు రూపం ఈ సంకలనం. ఆ నేపథ్యం తనే మరోచోట విశదంగా తెలియజేశారు. దివాకర్‌ తండ్రి గంగాధరరావు గారు విద్యాధికులూ, ఒకింత హేతువాద బీజాలు గల వ్యక్తి అయినా ఉద్యోగం చేయలేదు. అమ్మ గున్నమ్మ అవకాశాలున్నా ఆనాటి సంప్రదాాయ సమాజంలో చదువుకోలేదు. అయినా తను ఉద్యమజీవిగా మారి పనిచేస్తుంటే ఆమె ఎలా సహకరించిందీ దివాకర్‌ చెప్పారు. ప్రజాసైన్సు ఉద్యమంలో తన హేతువాద భావాలను గున్నమ్మ గారు ఆశీర్వదించారు. తన కోడలు, దివాకర్‌ శ్రీమతి చంద్రికారాణి కూడా క్రమేణా సామ్యవాద భావాలను ఆకళింపు చేసుకోగలింది. భర్త మరణానంతరం వారిద్దరి కోరిక మేరకు గున్నమ్మ గారు కొందరికి నచ్చకపోయినా నూతన గృహం ప్రారంభోత్సవం చేశారు. పిల్లల సాహసానికి సంతోషించారు. అంతకుముందూ, తర్వాత కూడా దివాకర్‌ ఇల్లు సాహితీమిత్రులతో, సామాజిక శక్తులతో కళకళలాడుతుంది. గురజాడ వారసత్వం అన్నట్టు విజయనగరంలో సాహితీస్రవంతి నిరంతరాయంగా పనిచేస్తుందంటే ఈ కుటుంబం ఆదరణ, స్నేహశీలత ఒక ముఖ్య దోహదకారి. అలా వెళ్లినపుడు నేనూ అమ్మను ఒకటి రెండుసార్లు కలిశాను.
అస్వస్థతతో పోరాడుతున్న గున్నమ్మ గారు దివాకర్‌ ప్రేరణతోనే చరమదశలో అవయవ దానానికీ, తన భౌతిక కాయాన్ని పరిశోధనల నిమిత్తం ఇవ్వడానికి సిద్ధపడ్డారు.. ఇలాటి విషయాల్లో విస్తృత కుటుంబాల్లో ఏకాభిప్రాయం రావడం కష్టం. కొన్ని సందర్భాల్ల్లో భౌతికకాయం పరిస్థితి మరో సమస్య. ఏమైనా దివాకర్‌ చిత్తశద్ధితో అందుకు ప్రయత్నించడం, గున్నమ్మ గారు అంగీకరించడం గొప్ప విషయం. దివాకర్‌ ఈ పుస్తక ప్రచురణ ద్వారా అమ్మ తన అపూర్వ నివాళిని అర్పిస్తున్నాడు. తను ముభావంగా వుంటాననీ, వ్యక్తీకరణ శక్తి తక్కువని రాసుకున్నాడు గాని నిజానికి ఇంత కన్నా ఉద్వేగభరిత వ్యక్తీకరణవుంటుందా? అందుకే ఇదో మంచి వరవడి. ఇందులో అమ్మపై వచ్చిన ప్రసిద్ధ కవితలతోపాటు కొత్తగానూ రాయించి గున్నమ్మ గారి ద్వాదశావహస్సు నాటికే (ఈనెల 29న) ఆవిష్కరిస్తున్నాడు. ఈ సంకలనంలో సి.నారాయణరెడ్డి నుంచి పాయల మురళీకృష్ణ, గవిడి శ్రీనివాస్‌ల వరకూ అమ్మల గురించి రాసిన కవితలున్నాయి. ఎవరికివారు అమ్మ ఆర్ద్రంగా కళ్లు చెమ్మగిల్లేలా రాశారు. అనేకులు కవిత్వభాషలో వర్ణించారు. చాలామంది వారి మాతృమూర్తుల మరణానంతరం మననంలా రాశారు. ఎక్కువగా ఆరాధనా భావం, ఒకింత పశ్చాత్తాపం, ఒప్పుకోలు వంటివి కూడా చూస్తాం.
సంపాదకులు గంటేడ గౌరునాయుడు అన్నట్టు అమ్మ గురించి రాయని కవి ఎవరూ వుండరు. ఇటీవల ఇది పెరిగిందంటే అందుకు కారణం అస్తిత్వ ఆత్మిక ఆర్థిక సంక్షోభాలే. కాలికి దెబ్బ తగలగానే అమ్మా అని అరిచినట్టే ఈ సంక్షోభాల సుడిగుండంలో సంఘర్షణలో చిక్కిన కవి, రచయిత అమ్మను గుర్తుచేసుకుంటున్నాడు. ఆమె ఇచ్చిన మూలశక్తిని వెతుక్కుంటున్నాడు. వైద్యరంగంలో ఇప్పుడు బిడ్డ బొడ్దుతాడు భద్రపరచడం మనకు తెలుసు. ఎవరికైనా సరే అమ్మనుంచి వచ్చిన మూలశక్తి తొలి చైతన్యం. అందుకే అమ్మ అంటే సెంటిమెంటు కాదు, కమిట్‌మెంట్‌. ఆమెను తలుచుకోవడం ఒక కంటెంట్‌మెంట్‌. కమాండ్‌మెంట్‌. అమ్మా.. ది గ్రేట్‌ అని గతంలో రాసింది ఇక్కడ గుర్తు వస్తోంది. ఈ ముందుమాట రాసినంతసేపు మా అమ్మ, సమరశీల టి.సి. లక్ష్మమ్మ పక్కనే కూచుని రాయిస్తున్నట్టుంది. ఆమెను లక్ష్మమ్మ అంటే ఎంత సంతోషించిందో! ఒకరికి లక్ష్మమ్మ మరొకరికి గున్నమ్మ.. తల్లులందరినీ తలంచి.. అభినందనలు.
 

(ఈనెల 29న శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఆవిష్కరిస్తున్న 'పేగుబంధం' పుస్తకానికి ముందు మాట ఇది)
- తెలకపల్లి రవి