Feb 07,2023 15:44

- భూకంప మృతులు ఐదు వేలకు పైనే !
- టర్కీలో మూడు మాసాల పాటు ఎమర్జన్సీ
- భారీగా ధ్వంసమైన ఇస్కెందరన్‌ ఓడరేవు
- సిరియా జైలు నుండి తీవ్రవాదులు పరారీ?
- మృతుల సంఖ్య 20 వేలకు పైనే ఉండొచ్చని ఐరాస అంచనా

అంకారా, డమాస్కస్‌ : టర్కీ, సిరియాల్లో పెను విలయం సృష్టించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య రాన్రానూ పెరుగుతునే వస్తోంది. శిథిలాల కింద చిక్కుకుపోయిన నరకయాతనతో తనువు చాలించినవారు వేలల్లో బయటపడుతున్నారు. ఎక్కడ చూసినా శ్మశాన వాతావరణం కనిపిస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం ఐదు వేల మంది చనిపోయారు. టర్కీలో 3549 మంది, సిరియాలో 1602 మంది చనిపోయినట్లు సంబంధిత అధికారులు మంగళవారం నాడు ధ్రువీకరించారు. శిథిలాల కింద చిక్కుకుపోయి వేలాది మంది గాయపడ్డారు. శిధిలాల దిబ్బల నుండి మరిన్ని మృత దేహాలను వెలికితీస్తుండడంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. అయితే 20 వేల మందికి పైగానే మరణించి వుండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) అంచనా వేసింది. ఇప్పటివరకు దాదాపు 200 వరకు ప్రకంపనలు నమోదైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, సోమవారం నాటి భూకంపంలో తీవ్రంగా దెబ్బతిన్న పది ప్రావిన్స్‌ల వ్యాప్తంగా మూడు మాసాల పాటు అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు టర్కీ అధ్యక్షులు ఎర్డొగన్‌ మంగళవారం ప్రకటించారు. దీనివల్ల సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడానికి వీలవుతుందని తెలిపారు. మే 14న అధ్యక్ష ఎన్నికలు జరగడానికి కాస్త ముందు వరకు ఈ అత్యవసర పరిస్థితి వరకు అమల్లో వుంటుంది.
సహాయ, గాలింపు చర్యలు ఉధృతంగా చేపట్టినప్పటికీ మంచు, జీరో కన్నా తక్కువకు ఉష్ణ్నోగతలు పడిపోవడం, పైగా భారీ వర్షంతో కూడిన శీతల వాతావరణం కారణంగా అవాంతరాలు ఏర్పడుతున్నాయి. వీటికి తోడు పదే పదే వస్తున్న ప్రంకపనలు కూడా సహాయక చర్యలను దెబ్బతీస్తున్నాయి. అయినప్పటికీ పలు దేశాల నుండి వచ్చిన సహాయక సిబ్బంది కూడా గాలింపు చర్యల్లో పాల్గంటున్నారు. పేక మేడల్లా కుప్పకూలిన భవనాల శిధిలాల్లో చిక్కుకుపోయిన వారిని వెలికి తీయడం పెద్ద సవాలుగా మారింది. తాము జీవించే వున్నామని, వెలికితీయాంటూ ఆర్తనాదాలు వినబడుతున్నా వారిని చేరలేని దుస్థితి నెలకొంది. దీంతో అనేక హృదయ విదారక దృశ్యాలు కనబడుతున్నాయి. కాగా, 4700 ధ్వంసమైన భవనాల నుండి ఇప్పటివరకు దాదాపు 8వేల మందిని కాపాడినట్లు టర్కీ అధికారులు తెలిపారు.
మండుతున్న వందలాది కంటెయినర్లు
మరోవైపు టర్కీలోని హతారు ప్రావిన్స్‌లో గల ఇస్కెందరన్‌ ఓడరేవు భారీగా విధ్వంసమైంది. ప్రకంపన వందలాది షిప్పింగ్‌ కంటెయినర్లు ఇప్పటికీ ఇంకా మండుతునే వున్నాయి. దాంతో పెద్ద ఎత్తున నల్లని దట్టమైన పొగలు ఇంకా వెలువడుతుండడం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో నౌకలను ఇతర ఓడరేవులకు మళ్లిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న ఈ ఓడరేవు విధ్వంసం దృశ్యాలను ద్రోణ్‌ వీడియోల ద్వారా తీశారు.
సిరియాకు నిలిచిన సాయం
మరోవైపు సిరియాకు అందాల్సిన ఐక్యరాజ్య సమితి సాయం నిలిచిపోయింది. రాజకీయాల కారణంగా ప్రభుత్వ నియంత్రణలో గల ప్రాంతాలకు సాయం అందడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. దశాబ్ద కాలంగా ప్రచ్ఛన్న యుద్ధంతో అతలాకుతలమైన ప్రాంతంలోనే తాజాగా భూకంపం కూడా సంభవించడంతో అక్కడి పరిస్థితి చాలా దారుణంగా వుంది. ఇప్పటికే మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సిరియాకు పెద్ద ఎత్తున సాయం అందాల్సిన అవసరం ఎంతైనా వుందని ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలు పేర్కొంటున్నాయి.
జైలు నుండి ఖైదీల పరార్‌ !
భూకంపం కారణంగా సిరియాలో ఒక జైలు ధ్వంసమైంది. దీన్ని ఆసరాగా తీసుకుని అందులో నుండి పెద్ద సంఖ్యలో ఖైదీలు పారిపోయినట్లు తెలుస్తోంది. వారందరూ ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదులేనని తెలుస్తోంది. నైరుతి సిరియాలోని రాజో ప్రాంతంలో మిలటరీ పోలీసు జైలు వుంది. అందులో సుమారు 2వేలమంది ఖైదీలు వున్నారు. వారిలో దాదాపు 1300 మంది వరకు ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదులే. భూకంపాన్ని అవకాశంగా తీసుకున్న ఖైదీలు అక్కడి అధికారులపై తిరుగుబాటు చేశారు. వారిలో కొంతమంది పారిపోయారు.
భారత్‌ సాయం
భారత్‌ నుండి వెళ్ళిన మొదటి బ్యాచ్‌ సహాయక సామాగ్రి అంకారాలోని విమానాశ్రయానికి చేరిందని అధికారులు తెలిపారు. మరికొంత సామాగ్రిని తీసుకుని రెండో విమానం కూడా బయలుదేరింది. కాగా, భారత్‌ను దోస్త్‌గా పేర్కొంటూ టర్కీ కృతజ్ఞతలు తెలియచేసింది. భూకంపం కారణంగా మూడు విమానాశ్రయాలు పూర్తిగా ధ్వంసం కావడంతో సహాయ సామాగ్రి చేరవేయడం కూడా క్లిష్టంగా మారింది.
ఉపగ్రహ చిత్రాల సాయం
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో భారీగా విధ్వంసం, నష్టం చోటు చేసుకున్నపుడు క్షేత్ర స్థాయిలో వాటి వివరాలను తెలుసుకుని ఒక అంచనాకు రావడం కష్టమవుతూ వుంటుంది. అటువంటి సమయంలో ఉపగ్రహాలు తీసే చిత్రాలు ఎంతగానో సాయపడతాయి. తాజాగా టర్కీ, సిరియాలు కూడా అటువంటి అభ్యర్ధనే చేయడంతో పలు దేశాల ఉపగ్రహాలు ఈ భూకంపం తాలుకా చిత్రాలను అందించడానికి ముందుకొచ్చాయి.