Aug 05,2022 16:40

శ్రీనగర్‌ :  బిజెపి హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంపై జమ్ము కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ విరుచుకుపడ్డారు. భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు బిజెపి కుట్ర పన్నుతోందని,  ఏదో ఒక రోజు బిజెపి భారతీయ జెండా స్థానంలో కాషాయ జెండాను తీసుకువస్తుందని విమర్శించారు.  శ్రీనగర్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బిజెపి హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కాశ్మీర్‌లో రాజకీయ పార్టీల ప్రముఖులు వారి నివాసాల వద్ద జాతీయ జెండాను ఉంచాలని బిజెపి నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని  నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా, పిడిపి చీఫ్‌ మహబూబా ముఫ్తీ తిప్పికొట్టారు.  జమ్మూ కాశ్మీర్‌ రాజ్యాంగాన్ని, జెండాను దోచుకున్న విధంగా బిజెపి దేశ  జాతీయ జెండాను కూడా మార్చి వేస్తుందంటూ మండిపడ్డారు.  రాబోయే కాలంలో బిజెపి రాజ్యాంగాన్ని, దేశంలోని లౌకిక పునాదులను కూడా పెకిలించివేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశాన్ని మతతత్వ దేశంగా మారుస్తారని వ్యాఖ్యానించారు. లక్షల మంది కాశ్మీరీలు ప్రాణం త్యాగం చేసైనా జమ్మూ కాశ్మీర్‌ జెండాను, రాజ్యాంగాన్ని తిరిగి తెచ్చుకుంటామని మహబూబా ముఫ్తీ అన్నారు.