Feb 05,2023 22:06

ఫిబ్రవరి 9-12 వరకు ఎల్బీ స్టేడియంలో రెజ్లింగ్‌ టోర్నీ
హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో ప్రతిభావంతులైన రెజ్లింగ్‌ క్రీడాకారులను గుర్తించి, ఉపకారవేతనాలు అందించటమే లక్ష్యంగా ముఖేశ్‌ గౌడ్‌ మెమోరియల్‌ 'మల్లయుద్ధ' టోర్నమెంట్‌ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు ఎల్బీ స్టేడియంలో జరిగే కుస్తీ పోటీల్లో రూ.35 లక్షల నగదు బహుమతి అందిస్తున్నట్టు ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో నిర్వాహకులు, శ్రేష్ఠ్‌ ఫౌండేషన్‌ ఫౌండర్‌ విక్రమ్‌ గౌడ్‌ ప్రకటించారు. ' మా నాన్న కెరీర్‌ ఓ రెజ్లర్‌గా మొదలైంది. బస్తీ ప్రజల్లో ముఖేశ్‌ గౌడ్‌ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. రెజ్లింగ్‌ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏదైనా కార్యక్రమం చేయాలని ఆయన తపించేవారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా రెజ్లింగ్‌లో మల్లయుద్ధ చాంపియన్‌షిప్‌ నిర్వహిస్తున్నాం. బాల కేసరి నుంచి 100 ప్లస్‌ కేజీల విభాగం వరకు 17 కేటగిరీల్లో పోటీలు ఉంటాయి. సుమారు వెయ్యి మంది రెజ్లర్లు ఈ పోటీల్లో పోటీపడనున్నారు. ప్రతి విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కుస్తీ క్రీడాకారులను ఎంపిక చేసి జాతీయ, అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధమయ్యేందుకు ఆర్థిక సహకారం అందిస్తాం. రాష్ట్రంలో కుస్తీ క్రీడకు పూర్వ వైభవం తీసుకురావటమే లక్ష్యంగా ఈ మల్లయుద్ధ నిర్వహిస్తున్నామని' దివంగత ముఖేశ్‌ గౌడ్‌ కుమారుడు విక్రమ్‌ గౌడ్‌ పేర్కొన్నారు. తెలంగాణ రెజ్లింగ్‌ సంఘం, హైదరాబాద్‌ రెజ్లింగ్‌ సంఘం సహకారంతో 'మల్లయుద్ధ'ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఇక నుంచి ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామని విక్రమ్‌ గౌడ్‌ తెలిపారు.