Oct 01,2022 15:18

ప్రజాశక్తి - ఉండ్రాజవరం (తూర్పుగోదావరి) : ఎడతెరిపి లేకుండా మండలంలో కురుస్తున్న వర్షాలకు మండలంలోని చివటం గ్రామంలోని ఎస్సీమాల ఏరియా, హై స్కూల్‌ వెనుక నివాసముంటున్న 16 కుటుంబాల వారు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో తమ ఇళ్లలోకి నీరు చేరుకుని, ఇబ్బందులు పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీటితో పాటు పాములు, విష పురుగులు కొట్టుకు వచ్చి హానిచేస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంపుకు గురైన బాధితుల ఇళ్లను పరిశీలించిన ఎంపీటీసీ వారి సమస్యను పంచాయతీకి అధికారులకు విన్నవించిన అనంతరం తహసిల్దార్‌ కు వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపిటిసి వేముల వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లలో భాగంగా ప్రభుత్వం రోడ్లు నిర్మించి, ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరారు. ఈ విషయంపై తహశీల్దార్‌ జి కనకరాజు సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. పి భూలక్ష్మి, కొయ్య మంగ, బడుగు భూలక్ష్మి, టి మమత, విప్పర్తి దుర్గ, విప్పర్తి వెంకటరమణ, విప్పర్తి వీరభద్రరావు తదితరులు బాధితులుగా ఉన్నారు.