Jun 23,2022 16:26

ముంబయి  :  మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో ట్విస్ట్‌ ఎదురైంది. ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని రెబల్‌ ఎమ్మెల్యేలు కీలక ప్రకటన చేశారు. ఉద్ధవ్‌ థాకరే రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, ఎన్‌సిపి, కాంగ్రెస్‌లతో కూటమి రద్దు చేసుకుంటే చాలని ప్రకటించారు. ఈ మేరకు రెబల్‌ ఎమ్మెల్యేల్లో ఒకరైన దీపక్‌ కేస్కర్‌ వెల్లడించారు. ఎమ్మెల్యే దీపక్‌ కేస్కర్‌ గురువారం ఉదయమే గువహటిలో రెబల్‌ ఎమ్మెల్యేల శిబిరంలో చేరారు. గత 2 రోజులుగా ఉద్ధవ్‌ థాకరే పక్కనే కనిపించిన ఆయన గురువారం ఉదయం అసోం వెళ్లినట్లు సమాచారం. ఆయనతో పాటు మరో ఇద్దరు శివసేన ఎమ్మెల్యేలు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే గువహటి చేరుకున్నామని చెప్పారు.

ఉద్ధవ్‌ థాకరే రాజీనామాను తాము కోరుకోవడం లేదని, బిజెపి భాగస్వామ్యంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నట్లు దీపక్‌ కేస్కర్‌ తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంటే మహారాష్ట్రకు ప్రయోజనాలు ఉంటాయని, 41 మంది ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్‌ షిండే వైపే ఉన్నారని చెప్పారు. ఉద్దవ్‌ థాకరేతో ఇప్పటికే పలుమార్లు చర్చించామని, కానీ ఆయన రాజీనామా చేస్తానంటున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవులన్ని కాంగ్రెస్‌, ఎన్‌సిపిలకే దక్కాయని, శివసేనకు కేవలం పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖలు మాత్రమే ఉన్నాయని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బిజెపితో జట్టుకట్టాలని ఇక్కడున్న ఎమ్మెల్యేలు భావిస్తున్నారని దీపక్‌ కేస్కర్‌ చెప్పారు.

తనకు బిజెపి నుండి ఆఫర్‌ వచ్చిందని అన్నారు. అయితే తాను థాకరే కుటుంబాన్ని గౌరవిస్తానని, తాను శివసేన సైనికుడినేనని అన్నారు. గతంలో దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలోని బిజెపి -శివసేన ప్రభుత్వ హయాంలో తనకు అత్యుత్తమ ఫోర్ట్‌ఫోలియో ఉందని, కానీ ఈ సారి మంత్రి పదవి దక్కలేదని అన్నారు.

 ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే భావోగ్వేదంతో ఎమ్మెల్యేలకు చేసిన విజ్ఞప్తి విఫలమైంది. వర్షాలో ఆయన నిర్వహించిన భేటీ కేవలం 12 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చినట్లు  సమాచారం. ఉద్ధవ్‌తో కలిసి ఆ పార్టీకి ప్రస్తుతం 13 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఎమ్మెల్యేలు అజయ్  చౌదరీ, రవీంద్ర వైకర్‌, రాజన్‌ సాల్వీ, వైభవ్‌ నాయక్‌, నితిన్‌ దేశ్‌ముఖ్‌, ఉదయ్ సామంత్ , సునీల్‌ రౌత్‌, సునీల్‌ ప్రభు, దిలీప్‌ పాటిల్‌,  రమేష్‌ కొర్గాన్‌కర్‌,  ప్రకాశ్‌ ఫతర్పెకర్‌  మీటింగ్‌కు హాజరయిన వారిలో ఉన్నారు.