Sep 23,2022 07:55

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పిఎఫ్‌ఐ) కార్యాలయాలపై గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) దాడులు చేసింది. పిఎఫ్‌ఐ జాతీయ కార్యదర్శి నస్సరుదీన్‌ ఎలమారం సహా వంద మందికి పైగా నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసింది. వీరిలో కేరళ నుంచి 22 మందిని, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి చెరో 20 మందిని, తమిళనాడు నుంచి 10 మందిని, అస్సాం నుంచి తొమ్మిది మందిని, ఉత్తరప్రదేశ్‌ నుంచి ఎనిమిది మందిని అధికారులు అరెస్టు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, గుంటూరు, కర్నూలు తదితర ప్రాంతాల్లోనూ ఎన్‌ఐఎ దాడులు నిర్వహించి, పలువురిని అదుపులోకి తీసుకుంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, మనీలాండరింగ్‌ సహా వివిధ ఆరోపణలతో ఈ అరెస్టులు జరిగాయి. మనీలాండరింగ్‌ ఆరోపణలతో ఎన్‌ఐఎ కేసులు నమోదు చేసిన వెంటనే వీటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) దర్యాప్తు ప్రారంభించడం విశేషం. పిఎఫ్‌ఐకు దేశంతో పాటు విదేశాల నుంచి కూడా నిధులు రావడంపై ఇడి విచారణ సాగిస్తుంది.