Jan 24,2023 18:16

ఇంటర్నెట్‌డెస్క్‌ : 'వీరసింహారెడ్డి' చిత్ర సక్సెస్‌మీట్‌లో బాలకృష్ణ 'అక్కినేని తొక్కినేని' అన్న వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై హీరో నాగచైతన్య స్పందించారు. 'నందమూరి తారకరామరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరచుకోవటం' అని నాగచైతన్య ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌నే హీరో అఖిల్‌ రీ ట్వీట్‌ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు మనవళ్లే కాదు.. ఎస్వీ రంగారావు అభిమానులు కూడా బాలకృష్ణపై మండిపడుతున్నారు. ఈ నెల 25 లోపు బాలకృష్ణ అక్కినేని, ఎస్వీ రంగారావు అభిమానులకు క్షమాపణ చెప్పాలని అభిమానులు కోరుతున్నారు.
కాగా, వీరసింహారెడ్డి సక్సెస్‌ మీట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో నటులు అందరూ అద్భుతంగా నటించారు. వారితో నాకు మంచి టైం పాస్‌ అయ్యింది. ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావుగారు, ఈ అక్కినేని, తొక్కినేని అన్ని మాట్లాడుకునేవాళ్లం' అని అన్నారు. ఈ వ్యాఖ్యలే వివాదాస్పదమై సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతున్నాయి.