Sep 29,2022 21:33

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి :రాయలసీమ పశ్చిమ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా డాక్టర్‌ పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డిలను ప్రకటించారు. ఈ మేరకు పిడిఎఫ్‌ (ప్రొగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌) పక్ష ఉపనాయకులు కెఎస్‌.లక్ష్మణరావు గురువారం అనంతపురంలోని కనకదాసు కల్యాణమంటపంలో అభ్యర్థుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అభ్యుదయ, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ, సామాజిక తరగతులకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగరాజు, నరసింహారెడ్డి పేర్లను లక్ష్మణరావు ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి ఏర్పాటైన తరువాత ప్రజాస్వామిక గొంతుకలుండాలన్న ఉద్దేశంతో పిడిఎఫ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం శాసనసభలో వ్యక్తిగత దూషణలు తప్ప ప్రజా సమస్యలపై అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యులు చర్చించే పరిస్థితులు లేకుండా పోయాయని విచారం వ్యక్తం చేశారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు మాత్రమే ప్రజా సమస్యలపై మండలిలో గళం విప్పుతున్నారని తెలిపారు. అందుకే రాయలసీమ పశ్చిమ నియోజకవర్గాల నుంచి నాగరాజు, కత్తి నరసింహారెడ్డిలను గెలిపించాలని కోరారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ.గఫూర్‌ మాట్లాడుతూ.. సిఐటియు తరపున ఇద్దరు అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. వారి విజయానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర సహా అధ్యక్షులు సురేష్‌, కార్యదర్శి లక్ష్మణరాజు, ఎస్‌టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మన్న, సిఐటియు, ఎఐటియుసి, ఐద్వా, ప్రగతిశీల మహిళా సంఘం, జన విజ్ఞాన వేదిక నాయకులు పాల్గన్నారు.
పిడిఎఫ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటా : నాగరాజు
ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు పనిచేస్తున్న సీనియర్‌ పిడిఎఫ్‌ నాయకుల మార్గదర్శకాలకు అనుగుణంగా తాను నడుచుకుంటానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించే వారి పట్ల ప్రభుత్వం నిర్బంధం విధిస్తోందన్నారు. ప్రభుత్వ శాఖల్లో అనేక ఉద్యోగాలు ఖాళీగానున్నాయని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల సమస్యలను పట్టించుకోవడం లేదని చెప్పారు.
పోరాటాన్ని కొనసాగిస్తాం : కత్తి నరసింహారెడ్డి
గత ఆరేళ్లుగా ప్రజా, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై పిడిఎఫ్‌తో కలసి పనిచేస్తున్నానని తెలిపారు. ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తానని తెలిపారు. కొంతమంది ధనం ద్వారా ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని, ఈ ప్రయత్నాలను తిప్పికొట్టే విధంగా అందరం కలసి ఎన్నికల్లో పనిచేయాల్సిన అవసరముందని చెప్పారు.