
ఎపి బీహార్‌తో పోటీపడుతోంది
ప్రజాశక్తి-ప్రొద్దుటూరు పుట్టపర్తిసర్కిల్/చాపాడు :ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిది ఫ్యాక్షన్ మనస్తత్వమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. యువగళం పేరుతో ఆయన చేపట్టిన పాదయాత్ర శుక్రవారానికి 114వ రోజుకు చేరుకుంది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమై మైదుకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. నాగులాపల్లి క్రాస్, ఖాదర్‌పల్లి, చాపాడు, సీతారాంపురం క్రాస్, చియ్యపాడు క్రాస్, అల్లాడుపల్లె దేవలాలు, కేతవరం, పుల్లయ్య సత్రం, విశ్వనాథపురం విడిది కేంద్రం వరకూ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా పలుచోట్ల లోకేష్ మాట్లాడుతూ జగన్ పాలనలో లాయర్లు, డాక్టర్లు, వ్యాపారస్తులు, టీచర్లు, ఐటి నిపుణులు అందరూ బాధితులేనన్నారు. సొంత జిల్లా కడప, సొంత నియోజకవర్గం పులివెందులకు సిఎం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఉమ్మడి కడప జిల్లాలో పదికి పది సీట్లు ఇస్తే జగన్ చేసింది ఏం లేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎపి బీహార్‌తో పోటీ పడుతోందని విమర్శించారు. ప్రస్తుతానికి షాపులు, వ్యాపారాల మీద దాడి చేస్తున్నారని, మరోసారి ఓటేస్తే జగన్ అండ్ కో ఇంటికొచ్చి దోచుకుంటారని తీవ్ర విమర్శలు చేశారు. టిడిపి హయాంలో న్యాయ విభాగానికి నిధులు కేటాయించి కొత్త భవనాలు, లైబ్రరీలు కట్టించడానికి పనులు ప్రారంభించామని, ఈ ప్రభుత్వం ఆ పనులు నిలిపివేసిందని ఆఅన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అడ్వకేట్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. జగన్ వేధింపుల వల్లే అన్ని కంపెనీలు ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నాయన్నారు. అమర్‌రాజా, ఫాక్స్ కాన్, రిలయన్స్ లాంటి సంస్థలు వేరే రాష్ట్రాలకు వెళ్లి పోయాయని గుర్తు చేశారు. పాదయాత్రలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టిడిపి కడప జిల్లా అధ్యక్షులు లింగారెడ్డి, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పుట్టా సుధాకర్‌యాదవ్ పాల్గొన్నారు.