
- 'యువగళం' పాదయాత్రలో నారా లోకేష్
ప్రజాశక్తి - బైరెడ్డిపల్లి (చిత్తూరు జిల్లా) : 'మంత్రులు వేణు, నారాయణస్వామి వస్తే బిసి, ఎస్‌సిలకు వైసిపి ప్రభుత్వంలో చేసిన మోసంపై చర్చకు నేను సిద్ధమ'ని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మంగళవారం చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలోకి ప్రవేశించింది. కైగల్ గ్రామంలో రైతులను పరామర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అరటి రైతులతో ముచ్చటించారు. 'ఎకరా అరటి సాగుకు రూ. మూడున్నర లక్షల పెట్టుబడి అవుతుంది. ఎరువులు, కూలీలు, విత్తనం ధర భారీగా పెరిగింది. ఎకరం పంట అమ్మితే రూ.లక్షన్నర మాత్రమే వచ్చింది. సుమారుగా రూ.రెండు లక్షలు నష్టపోయాం. పెట్టుబడి ఖర్చు తగ్గి, మంచి రేటు వస్తే తప్ప అరటి రైతులు కోలుకునే పరిస్థితి లేదని' రైతులు తెలిపారు. లోకేష్ స్పందిస్తూ... 'మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా పోరాడతాను. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అరటి రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరిస్తామని' హామీనిచ్చారు. అనంతరం రాయల్‌మహల్‌లో బిసి తరగతులతో సమావేశమయ్యారు. కులవృత్తులు చేసుకునేవారికి వైసిపి ప్రభుత్వంలో ఎటువంటి ప్రోత్సాహమూ లేదని విమర్శించారు. కార్పొరేషన్ చైర్మన్లకు కనీసం కుర్చీలు కూడా లేవన్నారు. 56 కార్పొరేషన్లు ఉన్నాయని, ఒక్కరికైనా ఒక్క లోన్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. 26 మంది బిసిలను జగన్ పాలనలో హత్య చేశారని ఆరోపించారు. జగన్‌ప్యాలెస్ లోపల సజ్జల, పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఉంటే ప్యాలెస్ బయట బిసిలు ఉన్నారని పేర్కొన్నారు. 12 యూనివర్సిటీలు ఉంటే 10 యూనివర్సిటీల్లో సిఎం సొంత సామాజిక తరగతికి చెందిన వారే ఉన్నారన్నారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి, మండల టిడిపి అధ్యక్షులు కిషోర్‌గౌడ్, సుబ్రమణ్యంశెట్టి, రాజన్న, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కైగల్ నుంచి ఎల్లూరు గ్రామం వరకు యాత్ర సాగింది. బుధవారం ఎల్లూరు నుంచి పలమనేరు మండలంలోకి యాత్ర ప్రవేశించనుంది.