Sep 07,2022 12:03

మతం, భాష పేరుతో దేశాన్ని చీలుస్తున్నారు!
త్రివర్ణ పతాకం దాడికి గురవుతోంది
బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లపై రాహుల్‌ గాంధీ విమర్శ
కన్యాకుమారిలో భారత్‌ జోడో యాత్ర ప్రారంభం

కన్యాకుమారి : దేశ జాతీయ పతాకంలోని మూడు రంగులు ప్రతి మతానికి, రాష్ట్రానికి, భాషకి చెందినవని, కానీ ఈనాడు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు వాటిపైనే దాడి చేస్తున్నాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. భారతదేశాన్ని మతం, భాష పేరుతో విభజిస్తున్నాయని అన్నారు. ''ఈనాడు భారతదేశం అత్యంత అధ్వానమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొద్దిమంది వ్యాపారవేత్తలే యావత్‌ దేశాన్ని నియంత్రిస్తున్నారు. గతంలో ఈస్టిండియా కంపెనీ దేశంపై పెత్తనం చెలాయిస్తే, ఈనాడు కేవలం మూడు నాలుగు బడా కంపెనీలే దేశంపై గుత్తాధిపత్యం సాగిస్తున్నాయి.'' అని రాహుల్‌ విమర్శించారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి భారత్‌ జోడో యాత్ర బుధవారం ప్రారంభమైంది. అంతకుముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌, రాజస్థాన్‌ సిఎం అశోక్‌ గెహ్లాట్‌, చత్తీస్‌ఘడ్‌ సిఎం భూపేష్‌ బఘేల్‌ జాతీయ పతాకాన్ని రాహుల్‌కు అందజేశారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ఒక్క సంస్థా దాడికి గురవుతోందని అన్నారు. ఈ తరుణంలో దేశాన్ని సమైక్యంగా వుంచడానికి ప్రజల తోడ్పాటు కావాలని కోరారు. ''మన త్రివర్ణ పతాకం ఎవరికి ఇష్టమైన మతాన్ని వారు ఆచరించుకునే అవకాశాన్ని, హక్కును కల్పించింది. కానీ ఈనాడు ఆ పతాకమే దాడికి గురవుతోంది.'' అని పేర్కొన్నారు. ఈ త్రివర్ణ పతాకం అంత సులభంగా రాలేదని, ప్రతి మతానికి, ప్రాంతానికి, భాషకి చెందిన భారతీయులు కష్టపడి, త్యాగాలు చేసి సాధించినదని అన్నారు. సిబిఐ, ఇడి, ఐటిలను ఉపయోగించి ప్రతిపక్షాలను భయపెట్టగలమని వారు (బిజెపి) అనుకుంటున్నారు. కానీ భారతీయులను వారు సరిగా అర్థం చేసుకోలేదు. భారతీయులు ఇలాంటి వాటికి భయపడరు. ఏ ఒక్క ప్రతిపక్ష నేత కూడా బిజెపికి భయపడడం లేదు.'' అని అన్నారు.
ఈ యాత్ర ప్రారంభించడానికి ముందు రాహుల్‌ గాంధీ శ్రీపెరంబదూర్‌లో తన తండ్రి మరణం నేపథ్యంలో ఏర్పాటు చేసిన రాజీవ్‌ గాంధీ మెమోరియల్‌ను సందర్శించి, ఆయనకు నివాళులర్పించారు. అక్కడ జరిగిన ప్రార్ధనా సమావేశంలో పాల్గన్నారు. ఆ తర్వాత ప్రారంభమైన ఈ యాత్ర ఉత్తర దిశగా ముందుకు సాగుతోంది. చివరగా శ్రీనగర్‌లో ముగియనుంది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతో పాటు 119మంది భారత్‌ యాత్రికులు ఈ యాత్రలో పాల్గన్నారు. రోడ్లపైనే ఉంటూ, శిబిరాల దగ్గరే ఆహారం వండుకుంటూ, రాబోయే 148 రోజులు రాహుల్‌ ముందుకు సాగనున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు 12 రాష్ట్రాల గుండా 3,570 కిలోమీటర్ల దూరం ఈ యాత్ర సాగనుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయావకాశాలను మరింత మెరుగుపరుచుకునే లక్ష్యంతో ఐదు మాసాల పాటు సాగే ఈ యాత్రను కాంగ్రెస్‌ చేపట్టింది. ఉదయం 7గంటల నుంచి 10.30 గంటల వరకు, సాయంత్రం 3.30గంటల నుండి 6.30 గంటల వరకు ఈ యాత్ర సాగుతోంది. ఉదయం సాగే ప్రదర్శనలో కొద్దిమంది మాత్రమే వుంటారు, సాయంత్రం సాగే ప్రదర్శనలో ప్రజలను పెద్ద సంఖ్యలో సమీకరిస్తారు. సామాన్యుల ఆందోళనలను దేశ రాజధానికి చేర్చాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ యాత్రను స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అతిపెద్ద స్థాయిలో ప్రజలను కలుసుకునే కార్యక్రమంగా కాంగ్రెస్‌పార్టీ అభివర్ణిస్తోంది.