
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో బుధవారం జరిగిన కారు ప్రమాదంలో నలుగురు సజీవదహన మయ్యారు. ఈ మేరకు సమాచారాన్ని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన హర్దా జిల్లాలో చోటుచేసుకుంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బుధవారం ఓ కుటుంబం కారులో పెళ్లికి వెళ్లి వస్తుండగా..కారు వేగంగా చెట్టును ఢకొీట్టిందని, దీంతో కారులో నుంచి మంటలు చెలరేగి కారులో ఉన్న నలుగురు సజీవదహనమయ్యారని పోలీసులు తెలిపారు. అందులో ముగ్గురు పురుషులు, ఓ మహిళ ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన జంటకు ఆరు నెలల క్రితమే వివాహమైందని పోలీసులు వెల్లడించారు. ఈరోజు తెల్లవారుజామున ప్రమాదం జరిగినట్లు తమకు సమాచారం అందడంతో.. అగ్నిమాపక సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా.. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
కాగా, గతవారమే మధ్యప్రదేశ్‌లో బస్సు, ట్రాలీ ఢకొీన్న ఘటనలో 15 మంది మృతి చెందారు. ఆ ఘటన మరవకముందే ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడం గమనార్హం.