
ముంబయి : ఉద్ధవ్ థాకరే సొంత పార్టీ ఎమ్మెల్యేల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని రెబల్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేవారు. రెండున్నరేళ్లుగా తమను థాకరే అధికారిక నివాసం 'వర్షా'కు రానీయకుండా తలుపులు మూసేశారని అన్నారు. తాను బాలాసాహెబ్ కుమారుడినని, ముఖ్యమంత్రి పదవి కోసం పాకులాడనని బుధవారం ఉద్ధవ్‌థాకరే ఫేస్‌బుక్‌లో భావోద్వేగంతో కూడిన ఒక వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రసంగంపై స్పందిస్తూ రెబల్ ఎమ్మెల్యేల్లో ఒకరైన సంజరు షిర్సాత్ ఒక లేఖను విడుదల చేశారు. మిత్రపక్షాలైన ఎన్‌సిపి, కాంగ్రెస్ నేతలకు వర్షాలోకి ఎలాంటి అడ్డంకులు లేకుండా వెళ్లేవారని, కానీ తమను మాత్రం థాకరే నివాసంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని అన్నారు. తమని రెండున్నర ఏళ్లుగా సిఎం ఇంటికి రానివ్వలేదని, వారి నివాసం గేటు వద్ద ఎదురుచూస్తూ నిలుచున్నామని పేర్కొన్నారు. కానీ సంజరు రౌత్ చాణుక్యుడిలా అడ్డగించేవారని మండిపడ్డారు. ఆదిత్యథాకరే అయోధ్యకు వెళ్లిన సమయంలో తమను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ముంబయి విమానాశ్రయానికి చేరుకున్న తమను వెనక్కి రప్పించారని, రామ్ లల్లా దర్శించుకునేందుకు ఎందుకు అనుమతించలేదని మండిపడ్డారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఏక్‌నాథ్ షిండే తమకు అండగా నిలబడ్డారని అన్నారు. షిండేతోనే ఉంటామని ఆ లేఖలో పేర్కొన్నారు.