Sep 23,2022 08:05

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :  కేంద్రం కార్మిక వ్యతిరేకంగా రూపొందించిన లేబర్‌ కోడ్స్‌ను రాష్ట్రంలో అమలు చేసేందుకు అసెంబ్లీలో పెట్టి ఆమోదించుకుందని, దీన్ని రాష్ట్రంలో అమలు చేయవద్దని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు, కోశాధికారి ఎవి నాగేశ్వరరావు, కార్యదర్శి ఎం బాలకాశి కోరారు. లేబర్‌ కోడ్స్‌ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ దురాలోచనను సిఐటియు రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. గురువారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వేతనాలు, పారిశ్రామిక సబంధాలు, వృత్తిపరభద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్స్‌పై కేంద్రం సూచనల మేరకు రాష్ట్రం రూల్స్‌ రూపొందించిందని తెలిపారు. పార్లమెంటులో చర్చ లేకుండా ఆమోదించిన వాటిని ఇక్కడ అమలు చేసేందుకు రాష్ట్రం నిర్ణయించడం సరికాదన్నారు. రూల్స్‌పై కార్మిక సంఘాలతో చర్చించాలని సిఐటియు పలుమార్లు కోరిందని వివరించారు. దాదాపు 70 లక్షల మంది కార్మికుల కుటుంబాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని అన్నారు. పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడేందుకే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టిందని చెప్పారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కనుసన్నల్లో రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేయాలని చూడటం దుర్మార్గమని వివరించారు. దీనివల్ల సంఘ స్వేచ్ఛ, సమిష్టి బేరసారాల హక్కు, సమ్మె హక్కు దేశంలో కార్మికవర్గం కోల్పోతుందని చెప్పారు. ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ పథకాలను నోటిఫికేషన్‌ ద్వారా మార్చే హక్కును కేంద్రం తీసుకుందని అన్నారు. న్యూపెన్షన్‌ స్కీము, ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు వ్యాపారం ఇచ్చే విధంగా కోడ్లు రూపొందించిందని చెప్పారు. పనిగంటలు, వారాంతపు సెలవులు, భద్రత, ఆరోగ్యానికి సంబంధించిన కార్మికుల హక్కులను నోటిఫికేషన్‌ ద్వారా మార్చే హక్కు పొందారని అన్నారు. కార్మికశాఖను ఫెసిలిటేటర్‌గా మార్చడం ద్వారా హక్కులను పర్యవేక్షించేవారు లేకుండా పోతారని చెప్పారు. పనిగంటలు పెంచే అవకాశాన్ని యజమానులకు ఇచ్చిందని, యజమానులపై శిక్షలనూ బాగా తగ్గించారని వివరించారు. దీనివల్ల ప్రమాదాలు మారింత పెరిగే అవకాశం ఉందన్నారు. లేబర్‌ కోడ్స్‌ అమలైతే యజమానులకు ఏ బాధ్యత ఉండదని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని లేబర్‌ కోడ్స్‌ అమలును నిలిపేయాలని వారు కోరారు.