Oct 02,2022 21:11

న్యూఢిల్లీ : భారత్‌పై పూర్తి నమ్మకం ఉంచాలని ఆఫ్ఘనిస్థాన్‌ విద్యార్థులకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ సూచించారు. భారత్‌లో విద్య కోసం విద్యార్థుకు ఇచ్చిన వీసాలను రద్దు చేస్తారా అనే ప్రశ్నకు జైశంకర్‌ సమాధానం ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. వడోదరలో 'రైజింగ్‌ ఇండియా అండ్‌ ది వరల్డ్‌' అనే అనే కార్యక్రమంలో జైశంకర్‌ను వీసాల కోసం అలీ ఇర్ఫాన్‌ అనే ఆఫ్ఘనిస్తాన్‌ విద్యార్థి ప్రశ్నించారు. కోవిడ్‌ కారణంగా కళాశాలను మూసివేడంతో భారత్‌లో చదువుకుంటున్న సుమారు 2,500 మంది ఆఫ్ఘనిస్తాన్‌ విద్యార్థులు స్వదేశం వెళ్లారని, అయితే అక్కడ తాలిబాన్‌ ప్రభుత్వం ఏర్పాటుకావడంతో తిరిగి భారత్‌కు మళ్లీ రాలేకపోతున్నారని చెప్పారు. వీళ్ల వీసాలను రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. దీనికి జైశంకర్‌ సమాధానం ఇస్తూ 'మేం ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో రాయబార కార్యాలయాన్ని ఉపసంహరించుకునే పరిస్థితలో ఉన్నాం. అక్కడ పాస్‌పోర్టులు, వీసాలు ఎవరి ఎవరివో నిర్థారించుకునే పరిస్థితిలో కూడా లేం. ఇదే అసలైన సమస్య' అని చెప్పారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌ పౌరులకు వీసాలను భారత్‌ రద్దు చేసింది. దాని స్థానంలో ఈ వీసాలను ప్రవేశపెట్టింది. అయితే వీసాలకోసం కొన్ని వేల దరఖాస్తులు వస్తుంటే, పదుల సంఖ్యలో మాత్రమే అనుమతిస్తుంది. ప్రస్తుతం భారత్‌లో వివిధ యూనివర్శిటీల్లో సుమారు 14 వేల మంది ఆఫ్ఘనిస్థాన్‌ విద్యార్ధులు ఉన్నట్లు అంచనా. వీరంతా కూడా 2019 నుంచి భారత్‌లో ఉండిపోయారు. వీరు వీసా ప్రక్రియను పునరుద్ధించాలని కోరుకుంటున్నారు.