Jul 03,2022 15:46

ప్యోంగ్యాంగ్‌ :   ఆసియాలో నాటో తరహా సైనిక కూటమి ఏర్పాటుకు అమెరికా యత్నిస్తోందని ఉత్తరకొరియా వ్యాఖ్యానించింది. ఇటీవల అమెరికా దక్షిణ కొరియా, జపాన్‌లతో సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడాన్ని తప్పుపట్టింది. సైనిక కూటమి ఏర్పాటు ప్రణాళికలో ఇదొక భాగమని పేర్కొంది. ఉత్తరకొరియా నుండి మప్పు పొంచి ఉందంటూ అమెరికా ప్రచారం చేయడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఆసియా-పసిఫిక్‌లో సైనిక ఆధిపత్యాన్ని సాధించడమేనని ఉత్తర కొరియా ప్రతినిధి పేర్కొన్నారు. రక్షణ పరంగా వేగంగా మారుతున్న పరిణామాలకు అనుకూలంగా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఈ ఏడాది ఉత్తరకొరియా భారీ సంఖ్యలో క్షిపణి పరీక్షలను నిర్వహించింది. మరోసారి అణు పరీక్షలు నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

గత వారం నాటో సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా, దక్షిణ కొరియా ప్రధాని యూన్‌ సుక్‌ యోల్‌లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉత్తర కొరియా అణు పరీక్షలపై చర్చించారు. అనంతరం జపాన్‌ అధ్యక్షుడు కిషిదా మాట్లాడుతూ.. అమెరికా-జపాన్‌, అమెరికా-దక్షిణ కొరియాల కూటములు శత్రు దేశాల దుందుడుకు చర్యలను కట్టడి చేసే సామర్థ్యాలను మెరుగు పర్చుకోవాలని అన్నారు. దీనిలో భాగంగా అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా మధ్య త్రిముఖ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని పేర్కొన్నారు.

1910 నుంచి 45 వరకు జపాన్‌ సైన్యం కొరియా ద్వీపకల్పాన్ని ఆక్రమించింది. దీంతో దీర్ఘకాలం పాటు దక్షిణ కొరియా-జపాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు మూన్‌జెఇన్‌ హయాంలో ఇవి మరింత తీవ్రమవడంతో ఇరు దేశాల మధ్య నిఘా సమాచారం పంచుకోవడంపై ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకొన్నారు. అయితే ప్రస్తుతం జపాన్‌, దక్షిణ కొరియా దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ఇరు దేశాధినేతలు అంగీకరించారు.