
- వలంటీర్ల వ్యవస్థ పేదలను పీడించడానికా?
- తక్షణం పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలి
- 'అనంత' సత్యాగ్రహ దీక్షలో వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : రాష్ట్రంలో పేదలకు, పెద్దలకు మధ్య పోరుసాగుతోందంటూ ముఖ్యమంత్రి మాటలు చెప్పడం కాదు... పేదల సమస్యలు తక్షణం పరిష్కరించి చేతల్లో చూపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెబుతున్న మాటలకు, ఆచరణకు పొంతన ఉండడం లేదని విమర్శించారు. పేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఎం అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట 30 గంటల సత్యాగ్రహ దీక్షను ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పేదల పక్షమైతే ఇంతమంది పేదలు ఇళ్ల స్థలాలు, పట్టాల కోసం అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎందుకు తిరగాల్సి వస్తోందని ప్రశ్నించారు. పేదలకు తక్షణం పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు అంతా చేస్తున్నట్టు చెబుతూ ఆచరణలో పెట్టుబడిదారులకు వేల ఎకరాల భూములను కట్టబెడుతున్నారని విమర్శించారు. అనంతపురం జిల్లాలో అదానీ మొదలుకుని పెద్దపెద్ద సంస్థలకు 42 వేల ఎకరాల భూములను కట్టబెట్టారన్నారు. ఇక్కడి పేదలకు మాత్రం 42 గజాల భూమి ఇవ్వడానికి కూడా చేతులు రావడం లేదని విమర్శించారు. అనంతపురం నగరం పరిధిలోనే 12 కాలనీల్లో వేలాది మంది నిరుపేదలు సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని నివాసముంటున్నా, వారికి ఇంటి పట్టా ఇవ్వడం లేదన్నారు. గడపగడపకూ సేవలందిస్తామంటూ వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన ప్రభుత్వానికి ఈ సమస్యలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వలంటీర్ల వ్యవస్థ ప్రజలకు మేలు చేయడం కంటే ఆందోళనలకు వెళ్లిన వారికి సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టేందుకు ఎక్కువ ఉపయోగపడుతోందని, ప్రజలను పీడించే వ్యవస్థగా మారుతోందని దుయ్యబట్టారు. ఇంకోవైపు కేంద్రంలోని బిజెపి కూడా అంబానీ, అదానీలకు మేలు చేసే విధానాలనే అవలంభిస్తోందన్నారు. హిడెన్‌బర్గ్ నివేదికతో అదానీ తప్పుడు లెక్కలు బయటకొచ్చాయని తెలిపారు. అదానీ సంస్థలో పెట్టుబడులకు ఎస్‌బిఐ, ఎల్‌ఐసి వంటి ప్రభుత్వరంగ సంస్థల నుంచి కూడా అప్పులిచ్చారన్నారు. ఈ సంస్థ ఇప్పుడు నష్టపోతే జరిగే నష్టం అదానీకి కాదని, ఎస్‌బిఐ, ఎల్‌ఐసిలకని తెలిపారు. ఈ రకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పేదలకు కాకుండా పెద్దలకు అనుకూలమైన విధానాలు అవలంభిస్తున్నాయని విమర్శించారు. సత్యాగ్రహ దీక్షలో పశ్చిమ రాయలసీమ పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి నాగరాజు పాల్గని మద్దతు తెలిపారు. పేదల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఒ.నల్లప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం అనంతపురం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, కార్యదర్శివర్గ సభ్యులు సావిత్రి, బాలరంగయ్య, నాగేంద్రకుమార్, బి.శ్రీనివాసులు, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లాలోని పేదలు పాల్గన్నారు. సత్యాగ్రహ దీక్ష వద్ద రోడ్డుపై నాయకులు. పేదలు భోజనాలు చేశారు.