
మనదేశపు మొదటి ట్రాన్స్‌జెండర్ సివిల్ సర్వెంట్ ఐశ్వర్య రితుపర్ణ ప్రధాన్. ఒడిశా ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. చిన్నతనం నుండి స్త్రీగా గుర్తింపు పొందేవరకు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. పురుషుడిగా సర్వీస్‌లో చేరిన ఐశ్వర్య ట్రాన్స్జెండర్లను థర్డ్జెండర్లుగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో తన లింగ గుర్తింపుతో పాటు పేరూ మార్చుకున్నారు.
కంధమాల్ జిల్లాకు చెందిన ఐశ్వర్య అసలు పేరు రతికంత ప్రధాన్. ఆరో తరగతి చదువుతున్నప్పుడు తనలో మార్పులు మొదలయ్యాయి. అప్పటినుండి ఉపాధ్యాయులు, విద్యార్థుల నుండి అవమానాలు నిత్యకృత్యమయ్యాయి. 'పాఠశాలలో నేను భిన్నంగా ఉన్నందుకు ఉపాధ్యాయులు ఎగతాళి చేసేవారు, అవమానించేవారు. కాలేజీలో జీవితమూ ప్రశాంతంగా గడవలేదు. తోటి విద్యార్థుల నుండి లైంగిక వేధింపులకు గురయ్యాను. అడుగు బయటపెట్టడం ప్రతిరోజూ ఒక పరీక్షలాగే ఉండేది' అంటారు ఐశ్వర్య.
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నుంచి ఇంగ్లీష్ జర్నలిజం అభ్యసించిన ప్రధాన్ 2010లో ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర సివిల్ సర్వీసెస్‌లో పురుషుడిగా ప్రవేశించారు. 2014లో, థర్డ్ జెండర్ కేటగిరీని గుర్తించి, వారికి రాజ్యాంగపరమైన హక్కులను కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పు తర్వాత పురుష గుర్తింపును స్త్రీగా మార్చడంతోపాటు, తన పేరును ఐశ్వర్య రుతుపర్ణ ప్రధాన్‌గా మార్చుకోవడానికి కోర్టులో అఫిడవిట్ వేశారు. ఐశ్వర్య వస్త్రధారణను మార్చుకొని చీర ధరించారు. ఈ పరివర్తన చిన్ననాటి నుంచి ఆమె కోరుకున్న మానసిక ప్రశాంతతను అందించినప్పటికీ, సహచరులు, కింది ఉద్యోగులు ఆమెను ఆమోదించడం ఒక సవాలుగా మారింది.
''నా వస్త్ర, వేషధారణలో మార్పులు వచ్చినా, విధి నిర్వహణలో ఎలాంటి మార్పూ రాలేదు. ప్రారంభ అవాంతరాల తర్వాత ఉన్నతాధికారులు, సహచరులు, సబార్డినేట్లందరూ నన్ను అంగీకరించారు. ఇప్పుడు నన్ను కొత్త పేరుతో పిలుస్తున్నారు. సబార్డినేట్లు నన్ను 'సార్' అని కాదు, 'మేడమ్' అని సంబోధిస్తున్నారు'' అంటారు ఐశ్వర్య. ఎల్జిబిటి కమ్యూనిటీ జీవితాలను సులభతరం చేయడానికి, సమాజంలో మరింత ఆమోదయోగ్యంగా మార్చడానికి న్యాయవ్యవస్థ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, తమ లాంటి వారికి మంచిరోజులు వస్తున్నాయని ఐశ్వర్య అభిప్రాయపడతారు.