Feb 06,2023 07:49

మాజంలోని అవినీతి, దురన్యాయాలు, దుష్ట సంప్రదాయాలను ఎండగడుతూ, మంచికి మానవత్వానికి పట్టం కడుతూ సమాజానికి మానసిక వైద్యం చేసేది రంగస్థలం. జీవితపు విలువలను ఎత్తిచూపుతూ, ఎత్తుపల్లాలను సరిచేస్తూ, పతనం వైపు పరుగులు తీసే మనిషి ఆలోచనలకు పగ్గం వేసేది- ప్రయోజనాత్మక నాటకం.
           గత సంవత్సరం అక్టోబర్‌ నుంచి అనేక పరిషత్తుల్లో పోటీపడుతూ బహుమతులు గెల్చుకుంటూ వ్యవస్థలోని అవినీతిని ఎండగడుతూ, ప్రదర్శింపబడుతున్న నాటిక 'మృత్యు పత్రం'. ఇది మద్దుకూరి ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ చిలకలూరిపేట వారి ప్రదర్శన. రచన దర్శకత్వం మద్దుకూరి రవీంద్రబాబు. ఇప్పటికే ఈ సమాజం వారు 'మంచం మీద పెళ్లి' అనే హాస్యనాటికతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
           డబ్బు, డబ్బును హెచ్చిస్తుంది కానీ చచ్చిన మనిషిని బతికించలేదు. మనిషి బతకడానికి మాత్రమే డబ్బు ఉపకరిస్తుంది. చదువుకున్న మనుషుల్లో సైతం స్వార్థం పెచ్చరిల్లి మోయలేనంత డబ్బు సంపాదనలో పడి, తమ చదువుల్ని ఉద్యోగాల్ని తాకట్టుపెట్టి, బతికున్న శవాలుగా జీవిస్తున్న వాళ్లను గురించిన నాటిక ఇది. విద్యా వైద్య న్యాయ పోలీసు పాలన వ్యవస్థల్లో ప్రజలకు సేవలందించాల్సిన అత్యవసర సేవా విభాగాలతో పాటు, అవసరమైన వారికి అవసరమైన ఆధికారిక పత్రాలను జారీ చేయడానికి- ముందు వెనుకలు మంచి చెడ్డలు ఆలోచించక, లంచాలకు మంచాలు వేస్తూ తమ పబ్బం గడుపుకునే డబ్బు గడ్డి తినే మనుషులు అన్ని రంగాల్లో మనకు కనిపిస్తారు. అలాంటి ఒక సందర్భాన్ని ఎంచుకొని ఆసక్తిదాయకమైన సన్నివేశాలు కల్పించి, గుండెను తాకే సంభాషణలు రచించి కళాత్మకంగా, రంగస్థలం ప్రయోజనాన్ని కళ్ళ ముందుకు తెచ్చిన నాటిక మృత్యుపత్రం.
       తన కడుపులోని గడ్డను తీయించుకోవడానికి తన జీవనాధారమైన ఒక పశువును అమ్ముకుని ఆ డబ్బుతో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న ఒక మాతృమూర్తికి, కళ్ళెదుటే జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల కొన ఊపిరితో ఉండి, నా అన్నవాళ్లు దరిలేని స్థితిలో ఒడిలో చేర్చుకున్న ఆ బిడ్డను, అది ఆమె కొడుకే అని భావించి, పోలీసు, ఆసుపత్రికి తీసుకువస్తుండగా మరణించిన బాలుడికి పోస్టుమార్టం నిర్వహించి డెత్‌ సర్టిఫికెట్‌ ఇవ్వటం వరకు జరిగే తంతును కథాంశంగా తీసుకొన్నాడు రచయిత. వ్యక్తులలో ధన దాహం, దోపిడీ, లంచగొండితనం, అవినీతి స్వభావం పెరిగిపోయి, మానవత్వం అన్నది కలికానికి కూడా కనిపించని స్థితిలో ప్రధాన పాత్రధారి నారాయణ అనే ఆటో డ్రైవర్‌కు షాక్‌ ఇచ్చే నిజం బయటపడడంతో అతడిలోని మనిషి/ తండ్రి బావురుమంటాడు. శవానికి కాపలా కాయడం, ఎలుకలు కొరికి తినకుండా చూడటానికి, సత్వరమే పోస్టుమార్టం నిర్వహించే లాగా చేయడానికి, కానిస్టేబుల్‌, కాంపౌండర్‌, డాక్టర్లలో అవినీతి విశ్వరూపం బయటపడుతుంది. మనిషికి అయితే 300, శవానికైతే 3000 అంటే, శాంతమ్మ అనే ఆ అమాయక పల్లె స్త్రీమూర్తి,తన శస్త్ర చికిత్స కోసం తెచ్చుకున్న మొత్తం అంతా హారతి కర్పూరంలా కరిగిపోగా, చేతి గాజులు కూడా ఇచ్చి కావలసిన కార్యం జరిపించమంటుంది. కత్తులతో పసిబిడ్డ శవాన్ని కోస్తారని తెలిసి, పోస్ట్మార్టం జరిపించకుండానే, మృత్యుపత్రం ఇప్పిస్తే.. తన పల్లెకు తీసుకుపోయి అంత్యక్రియలు జరిపించాలి అనుకుంటుంది.
          ఎట్టకేలకు చేతికొచ్చిన ఆ మృత్యుపత్రంలో ఏం రాసి ఉందో కాస్త చదివి చెప్పమంటుంది శాంతమ్మ. గుర్తు తెలియని వాహన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన బిడ్డ పేరు శ్రీరామ్‌ అనీ, ఊరు అడివిపాలెం అని.. బోయపాలెం జంక్షన్‌ వద్ద జరిగిన ఆ ప్రమాద వివరాలు రాసిన ప్రమాణం పత్రాన్ని చదువుతాడు కానిస్టేబుల్‌. పేరు నీకెలా తెలుసు? అని అడుగుతుంది ఆమె. పోలీస్‌ కానిస్టేబుల్‌ - చేతి మీద పచ్చబొట్టు ఉందిగా అంటాడు. ఆ మాటలు వింటున్న ఆటో డ్రైవర్‌ నారాయణ మీద పిడుగు పడ్డట్లే అవుతుంది. పేరు మళ్లీ చెప్పమంటాడు. అప్పటివరకు జరిగిన అవినీతి తంతులో.. బిడ్డ ఎవరో కూడా తెలియని శాంతమ్మలోని తల్లి తన రొంపిన ఉన్న డబ్బు మూట, చేతి గాజులు ఖర్చు చేసిన వైనం తెలిసి, అప్పటివరకూ,తాను ఆడిన నాటకం, తన వికృత వైఖరి గుర్తుకొచ్చి గుండెలు బాదుకొంటాడు. అప్పుడు శాంతమ్మ అడుగుతుంది.. ''ఆ సావుకాగితం ఎవరిది బాబు? చచ్చిపోయిన పసిబిడ్డదా? శవాలమీద డబ్బు సంపాదించుకోవాలని చూస్తున్న ఈ మనుషులదా?'' అని. ''మీరంతా చదువుకున్న పెద్దోళ్ళు గొప్పోళ్ళు. మీ ఉద్యోగాల్ని బతుకుల్ని మీ మనసుల్ని ఇలాంటి సావు కాగితాలకు తాకట్టు పెట్టి బతుకున్న శవాలుగా మారకండి బాబు!'' అంటూ ఆ మత్యు పత్రాన్ని చేతుల్లోంచి జారవిడుస్తుంది. ఆ దృశ్యాన్ని చూసిన ప్రేక్షకుల హృదయాలు కరుణ రసార్థ్రమౌవుతాయి. కళ్ళు అశ్రుజల పూరితాలు అవుతాయి. గుండెలు బరువెక్కుతాయి. జరిగిన అవినీతికి అసహనంతో కూడిన ఒక మేలుకొలుపు రక్త ప్రసరణలో వేగం తెచ్చి వేడిని పుట్టిస్తుంది. చర్నాకోలుతో శరీరాన్ని తాకిన సలపరం కలిగి బరువైన నిట్టూర్పు వెలబడుతుంది. ఒక జీవిత సారాంశం ఏదో చెప్పలేని వైరాగ్య వేదాంత మనస్థితిని కలిగిస్తుంది.
       అవినీతి జలగలు, మనిషి ఒంట్లోని రక్తాన్ని పీల్చేసినప్పటి భావన కలుగుతుంది. 'జింక పరిగెత్తడం నేర్చుకోకపోతే పులికి ఆహారమవుతుంది.. పులి పరిగెత్తడం నేర్చుకోకపోతే ఆహారం కరువవుతుంది.' 'అద్దాలమేడలో ఉన్నవాళ్లు అబద్ధం చెప్పినా నమ్ముతుందీ లోకం. పూరిగుడిసెలో ఉన్నవాడు పచ్చి నిజం చెప్పినా అబద్ధమే అంటుంది అదే లోకం.' ఇటువంటి సంభాషణలు ప్రేక్షకులను ఆలోచింపచేస్తాయి. ఒక అవినీతికి అద్దం పట్టి ప్రేక్షక లోకానికి ఇచ్చిన విజ్ఞాపన పత్రం- ఈ మృత్యు పత్రం.

- మల్లేశ్వరరావు ఆకుల
79818 72655