Nov 25,2022 07:25

          ఎన్నికల కమిషన్‌ (ఇ.సి) స్వతంత్రత గురించి చర్చ జరగడం ఇది మొదటి సారి కాదు. భారత్‌ వంటి సువిశాల ప్రజాస్వామ్య దేశంలో సక్రమ ఎన్నికల నిర్వహణ ఎప్పుడూ సవాలే! కోట్లాది మంది ప్రజానీకం ఎటువంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు గురికాకుండా నిర్భయంగా ఓటు వేసే వాతావరణాన్ని కల్పించడం ఎన్నికల కమిషన్‌ ప్రథమ బాధ్యత! ఇంత కీలకమైన కర్తవ్యాన్ని నిర్వహించాల్సి ఉంది కాబట్టే ఎన్నికల కమిషన్‌ ఎలా ఉండాలన్న అంశంపై రాజ్యాంగ సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. భిన్నాభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. ఇ.సి స్వతంత్రతకు ముప్పు వాటిల్లితే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందన్న ఆందోళన ఆనాడే వ్యక్తమైంది. గంపెడు ఆశలతో, భవిష్యత్‌పై విశ్వాసంతో ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ గడిచిన ఏడున్నర దశాబ్దాల కాలంలో ఎలా మారిందో, ఎక్కడకు చేరిందో ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్‌ స్వతంత్రత, నిష్పక్షపాత వైఖరి, కమిషనర్ల నియమాకంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం లేవనెత్తిన ప్రశ్నలను, చేసిన వ్యాఖ్యలను చూడాలి. 'ప్రధాని స్థాయి వ్యక్తిపై ఆరోపణలు వచ్చినా ఎన్నికల కమిషన్‌ స్పందించి చర్యలు తీసుకోవాలి' అంటూ ధర్మాసనం చేసిన వ్యాఖ్య దేశ ప్రజల ఆకాంక్షకు అద్దం పడుతోంది. 'జీ హుజూర్‌ అనే వ్యక్తులను కమిషనర్లుగా నియమిస్తే ఇ.సి కి స్వతంత్రత ఉండదు' అన్న మరో వ్యాఖ్య ప్రస్తుతం నెలకొన్న కఠోర వాస్తవాన్ని కళ్ల ముందు నిలబెడుతోంది.
         ఇ.సి స్వతంత్రతను ప్రశ్నార్థకంగా మార్చడమన్నది ఒక్క రోజులో జరిగిందేమీ కాదు. సుదీర్ఘకాలం కేంద్రంలో అధికారంలో కొనసాగిన కాంగ్రెస్‌ పార్టీకీ ఈ పాపంలో వాటా ఉంది. అయితే, నరేంద్రమోడీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విధ్వంస ప్రక్రియ మరింత వేగంగా సాగుతోంది. అన్ని రాజ్యాంగ వ్యవస్థలను ఒక వ్యూహం ప్రకారం కబళిస్తున్న బిజెపి ప్రభుత్వం ఇ.సి ని కూడా వదలలేదు. అరుణ్‌ గోయల్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించిన తీరు దీనికి తాజా నిదర్శనం. కమిషనర్ల నియామకంపై దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతున్న సమయంలోనే ఈ నియామకం జరపడం మోడీ సర్కారు బరితెగింపునకు నిదర్శనం. కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శిగా ఉన్న గోయల్‌ చేత స్వచ్ఛంద పదవీ విరమణ చేయించి మరీ ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. 'శుక్రవారం ఆయన విఆర్‌ఎస్‌ తీసుకున్నారు. శనివారమో, ఆదివారమో ఇ.సి గా ఆయన నియామక ఉత్తర్వులు విడుదలయ్యాయి. సోమవారం నుండి ఆయన పనిచేయడం ప్రారంభించారు' అని పిటిషనర్‌ తరపు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇంత వేగంగా పనులు కావడం ఎప్పుడన్నా చూశామా? దీని వెనుక ఎవరి ప్రయోజనాలూ లేవంటే నమ్మడం సాధ్యమా ?
         మరోవైపు ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలను ప్రతిపక్షాలు ఇ.సి దృష్టికి తీసుకువెళ్ళినా స్పందన నామమాత్రం గానో, అసలు లేకుండానో ఉండటం దేనికి సంకేతం? తమ ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికులు, ఉద్యోగుల చేత తప్పనిసరిగా ఓటు వేయిస్తామని, ఓటు వేయని వారి పేర్లను నోటీస్‌ బోర్డులో, వెబ్‌సైట్‌లో పెడతామని గుజరాత్‌ లోని అనేక కార్పొరేట్‌ సంస్థల చేత ఏకంగా ఎన్నికల కమిషనే ఎంఓయు కుదుర్చుకుంది. ఓటు వేసి తీరాలని ఒత్తిడి చేయడం రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నా ఇ.సి ఖాతరు చేయడం లేదు. ఈ ఒప్పందం ఎవరికి ఉపయోగపడుతుందో, కార్పొరేట్‌ సంస్థలు ఎవరి కోసం పని చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కర్ణాటకలో లక్షలాది మందిని అక్రమ ఓటర్లుగా చేర్పించారంటూ వెల్లువెత్తుతున్న ఫిర్యాదులపైనా ఇ.సి పెదవి విప్పడం లేదు. మన రాష్ట్రంలో ఎంఎల్‌సి ఎన్నికల్లో అనర్హులను ఓటర్లుగా చేర్పిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించడం లేదు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించాల్సిన అత్యంత కీలకమైన వ్యవస్థ డూడూ బసవన్నలతో నిండిపోతే పర్యవసనాలు ఇలాగే ఉంటాయి. ఇదే ధోరణి కొనసాగితే దేశ భవిష్యత్తుకే ప్రమాదం. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలోనైనా విస్తృత సంప్రదింపుల ద్వారా ప్రజలకు బాధ్యతగా వ్యవహరించే ఎన్నికల వ్యవస్థ రూపుదిద్దుకుంటుందని ఆశించగలమా !