Mar 19,2023 13:08

ప్రజాశక్తి - ఆలమూరు (అంబేద్కర్‌ కోనసీమ) : అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారు పెద్ద జాతర మహౌత్సవం మార్చి 20న జరగనుంది. శ్రీ అమ్మవారి ఆలయానికి రెండున్నర శతాబ్దాలు చరిత్ర ఉందని.. అమ్మవారి చంటి పిల్లలను చల్లగా చూసే తల్లిగా అక్కడి భక్తులు కొలుస్తారు. జాతర నాటి రాత్రి చంటి బిడ్డలతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు తమ బిడ్డలకు బాలరిష్టాలు నివారణకు కాగడాలు వేయించడం, వారకొల్లు పోయించుడం, తుళ్ళి బిళ్ళ తీయించడం చేస్తారు. జాతర సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కన్నుల పండుగగా జరుగుతాయి. బాణాసంచా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి ఉండవల్లి వీర్రాజు చౌదరి, ధర్మకర్తల మండలి చైర్మన్‌ నూకపెయి సూరిబాబు, దేవాదాయ శాఖ అధికారి భాస్కర శ్రీనివాసు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొత్తపేట డిఎస్పి కెవి రమణ, రావులపాలెం సిఐ రజని కుమార్‌, ఆలమూరు ఎస్సై ఎస్‌ శివప్రసాద్‌ తో పాటు పలువు ఎస్సైలు మరో 150 మంది పోలీసులు, మహిళా పోలీసులు, హౌంగార్డులు బందోబస్తు నిర్వహించనున్నారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే భక్తులకు ఆర్టీసీ వారు రాజమహేంద్రవరం, రావులపాలెం, రామచంద్రపురం, కాకినాడ, డిపోల నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. 20న జాతర, 21న తీర్థం, 22న ఉగాది సందర్భంగా బద్ది కడుగుట నిర్వహిస్తారు. నెల రోజులు పాటు జరిగే ఈ జాతరకు రెండు లక్షల పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. చింతలూరులో రావులపాలెం సిఐ రజని కుమార్‌ ఆధ్వర్యంలో ఆలమూరు ఎస్సై శివప్రసాద్‌ పర్యవేక్షణలో తాత్కాలిక పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసి 24 గంటలు భక్తులకు అందుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకున్నారు. చిన్నారులకు ఉచితంగా పాలు పంపిణీ ఏర్పాటు పూర్తయినట్లు చైర్మన్‌ తెలిపారు. ఎస్సైతో పాటు తాసిల్దార్‌ ఐపీ శెట్టి, ఎంపీడీవో జాన్‌ లింకన్‌, ఈఓపిఆర్డి రాజ్‌ కుమార్‌, పీహెచ్సీ వైద్యులు భవానీ శంకర్‌ ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.