
కంపెనీలకు కేంద్రం నోటీసులు
న్యూఢిల్లీ : విద్యుత్ ద్విచక్ర వాహనాల (ఇవి) ప్రమాద ఘటనలపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆయా కంపెనీలను కేంద్రం ఆదేశించింది. ఇటీవల ఇవి ప్రమాదాలు పెరగడంతో ఈ ఘటనలను ప్రభుత్వం సుమోటోగా స్వీకరించింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలను వివరించి, నాణ్యతా ప్రమాణాలపై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సిపిపిఎ) ఓలా ఎలక్ట్రిక్‌కు నోటీసులు జారీ చేసింది. ఇంతక్రితం ప్యూర్ ఇవి, బూమ్ మోటార్స్ వారి ఇ-స్కూటర్లు పేలడంతో సిసిపిఎ గత నెలలో నోటీసులు ఇచ్చింది.
సాధారణమే : ఓలా సిఇఒ
విద్యుత్ వాహనాల్లో అగ్ని ప్రమాదాలు జరగడం సాధారణమేనని ఓలా సిఇఒ భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. అంతర్జాతీయ కంపెనీలు తయారు చేసిన వాహనాల్లోనూ ఈ ఘటనలు చోటు చేసుకుంటాయన్నారు. బుధవారం రాత్రి ముంబయిలో టాటా నెక్సాన్ ఇవి అగ్ని ప్రమాదానికి గురైంది. దీన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. దీనిపై భవీష్ పై విధంగా స్పందించారు.