Sep 18,2023 08:47

ఒంగోలు : టిడిపి నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త బంద్‌ సమయంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో ... ప్రకాశం జిల్లా ఒంగోలు ఒకటో పట్టణ సిఐ టి.వెంకటేశ్వర్లుపై వేటుపడింది. విధి నిర్వహణలో విఫలమయ్యారంటూ వెంకటేశ్వర్లుపై వేకెన్సీ రిజర్వు (విఆర్‌)కు పంపిస్తూ గుంటూరు రేంజి ఐజీ జి.పాలరాజు ఆదివారం ఉత్తర్వులిచ్చారు. ఆయన స్థానంలో రెండో పట్టణ సిఐ ఎస్‌.జగదీష్‌ను నియమించారు. టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆ పార్టీ ఈ నెల 11న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం 144 సెక్షన్‌ విధించింది. ఒంగోలులో బంద్‌ నిర్వహించే క్రమంలోనూ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, టిడిపి కార్యకర్తలను నియంత్రించే విషయంలో ఉన్నతాధికారుల ఆదేశాలను సిఐ పట్టించుకోలేదనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.