Aug 11,2022 12:31

ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు అన్నారు. గురువారం మంగళగిరి తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కుంచనపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో విద్యుత్‌ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది. రైతు సంఘం కుంచనపల్లి గ్రామ అధ్యక్షులు అమ్మిశెట్టి రంగారావు అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి శివశంకరరావు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టడం దుర్మార్గమన్నారు. రైతాంగానికి, వ్యవసాయ రంగానికి, విద్యుత్‌ వినియోగదారులకు నష్టదాయకంగా ఉన్న విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించాలని ఆయన తెలిపారు. ఇప్పటికే వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, మరల విద్యుత్‌ బిల్లు అమలు అయితే వ్యవసాయదారుడుపై అదనపు భారం పడుతుందని ఆయన విమర్శించారు. అదేవిధంగా ప్రజలపై ట్రూ అప్‌ చార్జీలు భారం పడుతుందని అన్నారు. అదేవిధంగా వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లు పెట్టే ప్రక్రియను ఆపాలని ఆయన అన్నారు. అందులో భాగంగానే వైఎస్‌ఆర్సిపి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును అమలు చేసేందుకు పూనుకుందని వెంటనే ప్రజలపై భారాలు వేయకుండా విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. పెట్రోలు, డీజిల్‌ ధరలు రోజురోజుకీ పెరుగుతున్న మాదిరిగానే విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు అమలు అయితే విద్యుత్‌ ఛార్జీలు కూడా అడ్డు అదుపు లేకుండా పెరుగుతాయని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం తాడేపల్లి మండల కార్యదర్శి కాజా వెంకటేశ్వరరావు అన్నారు. తక్షణమే ప్రజలపై విద్యుత్‌ భారాలు వేయకుండా విద్యుత్‌ బిల్లును ఆపాలని ఆయన డిమాండ్‌ చేశారు. అనంతరం విద్యుత్‌ చట్ట సవరణ బిల్లుల ప్రతులను రైతు సంఘం నాయకులు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు దొంతి రెడ్డి వెంకటరెడ్డి, తాడిశెట్టి శ్రీనివాసరావు, ఎనుముల సాంబయ్య, బిరుదు గడ్డ పాలు, ఎమ్మెల్‌ పిచ్చయ్య, బాకీ శ్రీనివాసరావు, కోలాంటి ప్రసాద్‌, అమ్మిశెట్టి కైదులరావు తదితరులు పాల్గొన్నారు.