May 18,2023 15:33

సియోల్‌ : దక్షిణ కొరియాలో ఒంటరితనం వల్ల చనిపోయేవారి సంఖ్య రాబోయేరోజుల్లో గణనీయంగా పెరగనుందని ప్రభుత్వ సర్వే తెలిపింది. దాదాపు ఆ దేశంలో భవిష్యత్తులో 1.5 మిలియన్ల జనాభా ఒంటరితనం వల్ల చనిపోనున్నారని తాజాగా ప్రభుత్వ సర్వే గురువారం వెల్లడించింది. ఒంటరిగా ఉన్న వ్యక్తులు తమకెవరు లేరు అనే భావనతో చనిపోయేందుకు సిద్ధపడుతున్నారని సర్వేలో తేలింది. గతేడాది ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వశాఖ నవంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు 9,471 ఒంటరి సభ్యుల కుటుంబాలను సర్వే చేసింది. ఈ సర్వేలో ఒంటరి మరణాలకు దారితీసే పరిస్థితులు కనుగొన్నట్లు యోన్‌హాప్‌ అనే న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. ఈ సర్వేలో ఒంటరి సభ్యుల కుటుంబాలు సామాజిక పరస్పర చర్య ఉందా లేదా? అనారోగ్యం విషయంలో సహాయం కోరడానికి బంధువులు లేదా స్నేహితులు ఉన్నారా? అనే ప్రశ్నలతో పది ప్రశ్నల పత్రంతో ఆ కుటుంబాలను సర్వే చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. బహుశా దేశ జనాభాలో మూడోవంతు జనాభా భవిష్యత్తులో ఒంటరితనం వల్ల చనిపోయే అవకాశం ఉందని ఆరోగ్యమంత్రిత్వశాఖ అంచనా వేసింది.
కాగా, దక్షిణ కొరియాలో 50 మిలియన్ల జనాభా ఉంటే.. అందులో 21.3 శాతం మంది కేవలం ఒక వ్యక్తి ఉన్న కుటుంబాలే ఉన్నాయని ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. బంధులు లేని వ్యక్తులు, లేదా ఒకవేళ ఉన్నా.. వారు కొద్దికాలంపాటు కనిపించకుండా ఉంటే.. ఒంటరితనానికి గురై మరణిస్తారని, లోన్లీ డెత్‌ ప్రివెన్షన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ చెబుతోంది. అయితే 2027 సంవత్సరానికి లోన్లీ డెత్‌ సంఖ్య 20 శాతానికి తగ్గించేందుకు ఆరోగ్యమంత్రిత్వశాఖ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. ఒంటరితరానికి గురవుతున్న వ్యక్తులను ముందే గుర్తించి, ప్రజా సేవలను అందిస్తామని, ఈ ప్రమాదం నుంచి బయపడేలా.. తగిన చర్యలు చేపడతామని ఆరోగ్యశాఖ వెల్లడించింది.