Jan 25,2023 07:26

దేశ సంపదను స్వాహా చేస్తూ అపర కుబేరులుగా తయారవుతున్న సంపన్నులపై కొద్దిపాటి పన్ను వేసినా దేశంలోని దారిద్య్రాన్ని కొంతమేరకైనా తగ్గించవచ్చని ఆక్స్‌ఫాం నివేదిక అభిప్రాయపడింది. శతకోటీశ్వరులపై ఒకే ఒక్క మారు మూడు శాతం పన్ను వేస్తే ఐదు సంవత్సరాలపాటు హెల్త్‌ మిషన్‌ను నిరాఘాటంగా నిర్వహించవచ్చు. రెండు శాతం పన్ను వేస్తే రానున్న మూడు సంవత్సరాల వరకు పౌష్టికాహారం అందించడానికి నిధుల కొరత వుండదు.

'అసమానతల అంతం కోసం ఉద్యమం' పేరుతో పనిచేస్తున్న 'ఆక్స్‌ఫామ్‌' సంస్థ ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. 37 పేజీల ఈ రిపోర్టు అభివృద్ధి, దేశభక్తి చాటున పెరుగుతున్న సంపద రాశులు, పేదలపై పడుతున్న భారాల మోతలను మరోసారి బట్టబయలు చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే పెట్టుబడి పొట్ట విప్పి అందులోని పురుగులను బయటపెట్టింది. 'అంతా బాగుంది', 'దేశం ప్రపంచ అగ్రగామి స్థానానికి చేరుతుంది', 'విశ్వగురువులయ్యె కాలం వచ్చిందోచ్‌' అని పాలకులు, వారి వందిమాగధులు బాజాలు ఊదుకుంటున్న సమయంలోనే దేశ ప్రజల దుర్భర జీవితాలను అనేక అంతర్జాతీయ నివేదికలు బయటపెడుతున్నాయి. ఆకలి, మానవ స్వేచ్ఛ, ఆరోగ్య మరియు జీవనం, మానవాభివృద్ధి, పత్రికాస్వేచ్ఛ, పింఛన్‌ ఇలా అన్ని ప్రపంచ సూచికల్లో 2014 కంటే 2022 నాటికి అత్యంత వెనుకబడ్డామన్నది వీటన్నింటి సారాంశం. మరోవైపు శత కోటీశ్వరులు ప్రతి యేడు భారీగా పెరిగిపోతున్నారు. లెక్కలు చూపించని చీకటి బాబుల సంగతి కాక, లెక్కలు చెప్పిన వారి ప్రకారమే 2020లో 102 మంది శతకోటీశ్వరులు వుంటే 2022 నాటికి 166 మందికి పెరిగారు. 'ఇది మంత్రం కాదు, మహిమా కాదు, మ్యాజిక్‌ అంతకన్నా కాదు. తాయత్తు మహిమ' అన్నట్లు ఇది పెట్టుబడి, దానికి ఊడిగం చేసే ప్రభుత్వ విధానాల మహిమ.
 

                                                             ఆక్స్‌ఫామ్‌ నివేదిక ఏం చెప్పింది ?

దేశంలో అత్యంత ధనవంతులైన 30 శాతం మంది వద్ద దేశ సంపదలో 90 శాతం, అందులో 10 శాతం కుబేరుల వద్ద 80 శాతం, అందులో 5 శాతం అపర కుబేరుల వద్ద 62 శాతం, అందులో ఒక్క శాతం వున్న మహాకుబేరుల వద్ద 40.6 శాతం సంపద పోగుబడితే, సమాజంలో దిగువున ఉన్న యాభై శాతం జనం వద్ద కేవలం మూడు శాతం సంపద మాత్రమే వుందని ఈ నివేదిక ప్రకటించింది. 2012-2021 మధ్య దేశంలో సృష్టించబడిన సంపదలో 40 శాతం ఈ కుబేరుల వద్దకే చేరింది. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి కాలంలో కూడా ఈ కుబేరుల లాభాలు తగ్గకపోగా 121 శాతం పెరిగాయని, నిమిషానికి రూ.2.5 కోట్లు, రోజుకు రూ.3,068 కోట్లు వీరి ఖాతాల్లోకి చేరాయనే కళ్ళు బైర్లుకమ్మే నిజాన్ని బయటపెట్టింది. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సంఖ్యలో పేదలు 228.9 మిలియన్‌ మంది భారతదేశంలోనే వున్నారని, గత నాలుగు సంవత్సరాల్లో దేశంలో నిరుపేదల సంఖ్య 19 కోట్ల నుంచి 35 కోట్లకు చేరిందని చెప్పింది. 2020-21లో పొందిన పన్నుల మినహాయింపుల ద్వారా రూ.1,03,285.44 కోట్లు కార్పొరేట్‌ కంపెనీలు లాభపడ్డాయని వివరించింది.
             దేశంలోని వంద మంది సంపన్నుల దగ్గర 54.12 లక్షల కోట్లు, అందులో ఎగువున వున్న పది మంది శతకోటీశ్వరుల దగ్గర 27.52 లక్షల కోట్లు పోగుబడ్డాయి. బిజెపి కి అత్యంత ప్రీతిపాత్రుడైన గౌతమ్‌ అదానీకి కరోనా సమయంలో కూడా ఎనిమిది రెట్లు ఆదాయం పెరిగి 10.96 లక్షల కోట్లకు అధిపతి అయ్యి దేశంలో అత్యంత ధనవంతుడుగా అవతరించాడు. సైరస్‌ పూనావాలా, శివనాడార్‌, రాధాకిషన్‌ దామని, కుమార బిర్లాలు ముందటి సంవత్సరం కంటే 2022లో 20 శాతం ఎక్కువ సంపద పోగెేసుకున్నారని తెలిపింది. అంబానీలు సరేసరి. పెట్టుబడి ఆర్థికవేత్తలు లాభానికి మూలం డిమాండ్‌, సప్లయిలో చూపిస్తారు. అంటే ఉత్పత్తి చేసి, వాటిని మార్కెట్‌లో అమ్మకం చేసే క్రమంలో లాభాలు వస్తాయంటారు. కాని దేశంలో నూతన సంపన్నులుగా మారుతున్న ధనవంతులు పరిశ్రమలు పెట్టి ఉత్పత్తి చేసి లాభపడడంలేదు. ఉదా: దేశంలోని శతకోటీశ్వరుల్లో 32 మంది ఆరోగ్య రంగంలో వైద్య వ్యాపారం చేస్తూ కార్పొరేట్‌ ఆసుపత్రులు, మందుల తయారీ పరిశ్రమను తమ కంబంధ హస్తాల్లోకి తీసుకొని భారీగా లాభపడుతున్నారు. వీరిలో సైరస్‌ పూనావాలా, దిలీప్‌ సంఘ్వీ, మురళి దివి వంటివారు అగ్రస్థానంలో వున్నారు. సరళీకరణ విధానాల పేరుతో ప్రభుత్వ వైద్యాన్ని బలహీనం చేసి, కార్పొరేట్‌ వైద్యాన్ని మందగజమంత బలోపేతం చేశారు. అలాగే విద్యారంగం మరో అతి పెద్ద వ్యాపార పరిశ్రమగా మారింది. భవన నిర్మాణం, ఇతర సర్వీసు రంగాల్లో ఈ కుబేరులు జొరబడి ఒకవైపు కార్మికుల శ్రమను, మరోవైపు ప్రజల జేబులను లూఠీ చేస్తున్నారు. ఇంతేకాదు దశాబ్దాల నుండి కార్మికుల శారీరక, మానసిక శ్రమల వల్ల అభివృద్ధి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలను చౌకగా కొల్లగొట్టి లాభపడుతున్నారు. సహకార వ్యవస్థను ధ్వంసం చేసి సర్వం ప్రైవేట్‌ మయం చేసేశారు.
 

                                                                          ఇది కార్పొరేట్ల ప్రభుత్వం

అనంతపురం జిల్లా కరువు గురించి ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్‌ చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న పుస్తకం (ఎవ్రీబడీ లవ్స్‌ ఎ గుడ్‌ డ్రాట్‌) రాశారు. కరువు అంటే కష్టాలు, ఆకలి, బాధలు కదా... ఎవరు ప్రేమిస్తారు? అంటే కరువును కూడా వాడుకొని కొందరు రాజకీయ నాయకులు, అధికారులు ప్రభుత్వ సొమ్మును ఎలా కాజేసి పేదల నోళ్లు కొట్టి... కార్లు, బిల్డింగ్‌లు ఎలా సమకూర్చుకుంటారో అందులో వివరించారు. అదే పద్ధతిలో కరోనా కాలంలో బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు లాభాలు కూడబెట్టింది. 2020-21లో కార్పొరేట్‌ కంపెనీలు 70 శాతం లాభాలు సంపాదించగా, దేశంలోని 84 శాతం మంది ప్రజల ఆదాయం భారీగా తగ్గిపోయింది. గౌతమ్‌ అదానీ రోజుకు రూ.1,612 కోట్లు లాభపడ్డారు. కరోనాకు ముందే అంటే 2019లో కార్పొరేట్‌ పన్ను స్లాబ్‌ను 30 శాతం నుండి 22 శాతానికి తగ్గించారు. అలాగే కొత్తగా ప్రారంభించే కార్పొరేట్‌ కంపెనీలకు 15 శాతం మాత్రమే పన్ను విధించారు. దీనివల్ల గతంలో ఎన్నడూ లేనివిధంగా కార్పొరేట్‌ పన్ను వసూళ్లు 16 శాతం తగ్గాయి. వీటి మొత్తం విలువ లక్ష 84 వేల కోట్లు. ఇంతేకాదు కార్పొరేట్‌ కంపెనీలు వివిధ బ్యాంకులలో తీసుకున్న రుణాలను కేంద్రప్రభుత్వం పెద్ద ఎత్తున మాఫీ చేసింది. 201-7-18లో రూ.1,61,328 కోట్లు, 2018-19 రూ. 2,36,265 కోట్లు, 2019-20 రూ.2,34,170 కోట్లు, 2020-21 రూ.2,02,781 కోట్లు, 2021-22లో రూ.1,57,096 కోట్ల రుణాలను అంటే గత ఐదు సంవత్సరాల్లో రూ.9,91,640 కోట్ల ప్రజల సొమ్మును ఈ కంపెనీలకు 'దేశభక్త' ప్రభుత్వం దోచి పెట్టింది.
 

                                                                సంపన్నులపై కొద్దిపాటి పన్ను వేసినా...

దేశ సంపదను స్వాహా చేస్తూ అపర కుబేరులుగా తయారవుతున్న సంపన్నులపై కొద్దిపాటి పన్ను వేసినా దేశంలోని దారిద్య్రాన్ని కొంతమేరకైనా తగ్గించవచ్చని ఆక్స్‌ఫాం నివేదిక అభిప్రాయపడింది. శతకోటీశ్వరులపై ఒకే ఒక్క మారు మూడు శాతం పన్ను వేస్తే ఐదు సంవత్సరాలపాటు హెల్త్‌ మిషన్‌ను నిరాఘాటంగా నిర్వహించవచ్చు. రెండు శాతం పన్ను వేస్తే రానున్న మూడు సంవత్సరాల వరకు పౌష్టికాహారం అందించడానికి నిధుల కొరత వుండదు. 2017-2021 మధ్య గాలివాటంగా, అప్పనంగా లాభాలు సంపాదించిన కంపెనీలపై 20 శాతం పన్ను వేస్తే రూ.1.79 లక్షల కోట్లు వస్తుంది. దీంతో దేశంలోని ప్రాథమిక పాఠశాల టీచర్లలో 50 లక్షల మందికి సంవత్సరానికి సరిపడే వేతనాలు ఇవ్వవచ్చని అదానీ, అంబానీలపై ఒకటి, రెండు శాతం పన్ను వేసినా దేశంలో చాలా సమస్యలను పరిష్కరించవచ్చునని రకారకాల మార్గాలను నివేదిక సూచించింది. పెట్టుబడిదారీ వ్యవస్థలోనే తక్షణ పరిష్కార మార్గాలను సూచించిన ఈ నివేదికను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, కనీసం ఆ మార్గాలనైనా ఆచరించమని డిమాండ్‌ చేయడం దేశభక్తుల, ప్రజల ప్రేమికుల కర్తవ్యం.

(వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు)
వి.రాంభూపాల్‌

వి.రాంభూపాల్‌