May 31,2023 13:16

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బిజెపి పార్టీ దేశవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఒకనెల పాటు జరిగే 'మహా జన సంపర్క్‌' పాన్‌ ఇండియా ప్రచార యాత్రను బుధవారం నరేంద్రమోడీ ప్రారంభించారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఈ ప్రచార యాత్రను మోడీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యలోనే బుధవారం అజ్మీర్‌లో జరిగే బహిరంగ సభలో ఈ పాన్‌ ఇండియా ప్రచారయాత్రను ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 'ఈ యాత్ర మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలను కవర్‌ చేయనుంది. ఈ యాత్ర మే 31 నుంచి జూన్‌ 30 వరకు కొనసాగనుంది. ఈ ప్రచార యాత్రలో 51 భారీ ర్యాలీలు, 500 బహిరంగ సభలు నిర్వహించనున్నాం. ఇక 500 లోక్‌సభ, 4000 విధాన సభ నియోజకవర్గాల్లో 600కి పైగా మీడియా సమావేశాలు నిర్వహించబడతాయి' అని ఆయన అన్నారు. ఈ ప్రచార యాత్ర సందర్భంగా 5 లక్షలకు పైగా ప్రముఖుల కుటుంబాలను ఆ పార్టీ నేతలు సంప్రదించనున్నట్లు తరుణ్‌ వెల్లడించారు.
కాగా, ఈ యాత్రలో 288 మంది బిజెపి అగ్రనాయకులు, 16 లక్షల మంది పార్టీ కార్యకర్తలు.. పది లక్షల బూత్‌లలో ఓటర్లతో సంభాషించనున్నట్లు తరుణ్‌ పేర్కొన్నారు. ఈ యాత్ర సందర్భంగా అధికారంలో ఉన్న బిజెపి తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన విజయాల సందేశాన్ని నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు ఓటర్లకు వివరించనున్నారు. ప్రచారంలో భాగంగా పార్టీ నాయకులు లోకసభ స్థాన పరిధిలోని వెయ్యి మంది ప్రముఖుల కుటుంబాలను కలవనున్నారు. దీంతోపాటు ఉపాధ్యాయులు, సోషల్‌ మీడియా ప్రభావశీలులు, ఇతర ప్రముఖలతో సెమినార్లతోపాటు దేశవ్యాప్తంగా 51 మెగా ర్యాలీలను నిర్వహించనున్నట్లు తరుణ్‌ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ యాత్ర జూన్‌ 25వ తేదీ ఎమర్జెన్సీ వార్షికోత్సవం నాడు కూడా జరగనుందని ఆయన అన్నారు. ఆరోజు మేధావులతో సభా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక ఆరోజు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సందర్భంగా అత్యవసర పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని ఎలా నాశనం చేసిందనే దానిపై ఒక డాక్యుమెంటరీ ప్రదర్శించనున్నట్లు తరుణ్‌ తెలిపారు. ఇక సోషల్‌ మీడియాను ప్రభావితం చేసేవారితో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ మీట్‌ నిర్వహించబడుతుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పనులపై వికాస్‌ తీర్థ్‌ ట్రస్సుచే వ్యాపార సదస్సు నిర్వహించబడుతుంది. జూన్‌ 20 నుంచి 30వ తేదీ వరకు బిజెపి డోర్‌ టు డోర్‌ (ఇంటింటి ప్రచారం) కార్యక్రమాన్ని చేపటనున్నారు. ఈ ప్రచారంలో కేంద్రమంత్రులు, జాతీయ ఆఫీస్‌ బేరర్లు సహా నాయకులు, కార్యాలయ బేరర్లు, కార్మికులు అందరూ పాల్గొంటారు. ఇక ఈ యాత్రలో కోట్లాది మంది బిజెపి కార్యకర్తలు పాల్గొంటారు. 300 మందికిపైగా ఎంపీలు, 1400 మందికి పైగా ఎమ్మెల్యేలు పాల్గొంటారని తరుణ్‌ వెల్లడించారు.
ఈ యాత్రలో భాగంగా 15,931 మండలాల్లో 18 నుండి 25 సంవత్సరాల వయసు గల ఓటర్లతో సదస్సులు నిర్వహించబడతాయి. దేశవ్యాప్తంగా ఉన్న అంగనవాడీ కేంద్రాల పరిధిలో ఉన్న అన్ని కుటుంబాలతో ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. పౌష్టికాహార అభియాన్‌ లబ్దిదారులను ప్రత్యేకంగా ఈ సమావేశానికి ఆహ్వానించనున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీలో ఎనిమిదిరోజులపాటు బైక్‌ యాత్రను కూడా నిర్వహించనున్నారు. ఈ ఎనిమిదిరోజుల్లో 4 వేలకు పైగా విధాన సభలలో నగర, గ్రామాల ప్రధాన ప్రదేశాల్లోనూ ఆటల పోటీలు, యువ సాధకులకు సన్మానం వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. అలాగే పిఎం కిసాన్‌ నిధి లబ్ధిదారులను ఈ సందర్భంగా సంప్రదించనున్నారు. వివిధ రైతు ఉత్పత్తిదారుల సంస్థల అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అసంఘటిత రంగ కార్మికులతో గ్రామ సర్పంచ్‌తో గ్రామ సభలు నిర్వహించబడతాయి. దేశవ్యాప్తంగా ఉన్న షెడ్యూల్డ్‌ కులాలు, తెగల లబ్దిదారులను సంప్రదించే ఒక గిరిజన గౌరవ్‌ యాత్రా మోర్చా కూడా నిర్వహించడం జరుగుతుంది. షెడ్యూల్డ్‌ తెగల ప్రతినిధులతో గౌరవ్‌ మోర్చా జిల్లాస్థాయిల్లో జరుగనుంది. ఈ కార్యక్రమాలు అటవీ జాతుల స్వాతంత్య్ర సమరయోదుడు బిర్సా ముండా పేరుతో ఈ కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతుంది. అలాగే వెనుకబడిన తరగతుల లబ్ధిదారులను బూత్‌ లెవల్లో బిజెపి నేతలు సంప్రదించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని మొత్తం 10 లక్షల బూత్‌లలో పది కోట్లమంది ప్రజలు అనుసంధానం కానున్నారని తరుణ చుగ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.