Nov 24,2022 06:27
  • 'ఒక చోట తల్లిదండ్రులు పని కోసం బయటకు వెళ్తారు. ఇంటి పక్కన ఉన్న పెద్దాయన వారి పాపపై కన్నేస్తాడు. ఇంకో చోట చాక్లెట్‌ ఆశచూపి చిన్నారిపై అత్యాచారం చేస్తాడు ఓ ప్రబుద్ధుడు. ఒక దగ్గర బడికి పంపించిన పాపాయిపై మాస్టారు కన్ను పడుతుంది. మరో దగ్గర స్కూలు బస్సులో వెళ్తున్న చిన్నారిపై డ్రైవరు దాడి చేస్తాడు' ఒకటా రెండా ఇలా ప్రతి రోజూ పసిపిల్లలై అఘాయిత్యాల వార్తలు చూస్తూనే ఉంటాం. బుడిబుడి నడకలు, బోసి నవ్వులు, ఆట పాటలతో గడపాల్సిన బాల్యం వారికి ఎన్నో మానని గాయాలను సొంతం చేస్తోంది. గట్టిగా అరిస్తేనే భయపడిపోయే వారికి లైంగిక దాడులు, అత్యాచారాలు, గర్భవిచ్ఛిత్తిలు నిత్యకృత్యమవుతున్నాయి. జాతీయ నేర గణాంకాల బ్యూరో తాజా నివేదిక ప్రకారం దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల కంటే మైనర్లపై జరుగుతున్నవే ఎక్కువని తేలింది.

'ఒక చోట తల్లిదండ్రులు పని కోసం బయటకు వెళ్తారు. ఇంటి పక్కన ఉన్న పెద్దాయన వారి పాపపై కన్నేస్తాడు. ఇంకో చోట చాక్లెట్‌ ఆశచూపి చిన్నారిపై అత్యాచారం చేస్తాడు ఓ ప్రబుద్ధుడు. ఒక దగ్గర బడికి పంపించిన పాపాయిపై మాస్టారు కన్ను పడుతుంది. మరో దగ్గర స్కూలు బస్సులో వెళ్తున్న చిన్నారిపై డ్రైవరు దాడి చేస్తాడు' ఒకటా రెండా ఇలా ప్రతి రోజూ పసిపిల్లలై అఘాయిత్యాల వార్తలు చూస్తూనే ఉంటాం. బుడిబుడి నడకలు, బోసి నవ్వులు, ఆట పాటలతో గడపాల్సిన బాల్యం వారికి ఎన్నో మానని గాయాలను సొంతం చేస్తోంది. గట్టిగా అరిస్తేనే భయపడిపోయే వారికి లైంగిక దాడులు, అత్యాచారాలు, గర్భవిచ్ఛిత్తిలు నిత్యకృత్యమవుతున్నాయి. జాతీయ నేర గణాంకాల బ్యూరో తాజా నివేదిక ప్రకారం దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల కంటే మైనర్లపై జరుగుతున్నవే ఎక్కువని తేలింది.
మైనర్లపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు 'లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ' (ఫోక్సో-POCSO) చట్టం ప్రవేశపెట్టి దశాబ్దం గడుస్తోంది. తాజా అధ్యయనం ప్రకారం మైనర్లపై అత్యాచార ఘటనలు అత్యధికంగా జరిగిన రాష్ట్రాల జాబితాలో మన ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉంది.

  • మన రాష్ట్రంలో ...

రాజధాని ప్రాంతమైన విజయవాడలో పలుమార్లు అత్యాచారానికి గురైన బాలిక గర్భం దాల్చే వరకు ఆ ఘోరం వెలుగు చూడలేదు. ఆ ఇంట్లో ఏడేళ్ల బాలిక నీరసంగా కనిపించడంతో ఏమైందని తల్లిదండ్రులు ఆరా తీశారు. పక్కింటి అంకుల్‌ నెమలి ఈకలు ఇస్తానని చెప్పి ఏదో చేశాడని ఆ బాలిక చెప్పింది. విని హతాశులైన తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన కూడా విజయవాడలోనే జరిగింది. 

మాచవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధి మారుతినగర్‌లో ఓ మైనర్‌ బాలికకు మాయ మాటలు చెప్పి లోబర్చుకున్న ఓ ప్రబుద్ధుడు ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. జులైలో ఈ ఘటన వెలుగు చూసింది.
నంద్యాల జిల్లా వెలుగోడు మండలానికి చెందిన ఓ బాలికపై ముగ్గురు యువకులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కూడా జులైలో వెలుగు చూసింది. దారివెంట నడుస్తున్న ఆమెను పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లిన దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు.
గుంటూరు నగర శివారు పరిధిలోని ఓ లాడ్జిలో తొమ్మిదేళ్ల బాలికపై ఇంజినీరింగ్‌ విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మే నెలలో వెలుగు చూసింది. ఐదారు నెలల్లో వెలుగు చూసిన ఎన్నో ఘటనల్లో ఇవి కొన్ని..
నగరాలు, పట్టణాల్లో జరిగిన ఈ నేరాలు కూడా ఆలస్యంగా రికార్డుల కెక్కుతుంటే ఇక గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికే వణుకు పుడుతోంది.

  • అవగాహన కల్పించాలి

చాలామంది పిల్లలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నప్పటికీ వాటిని సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. ఫిర్యాదులు తక్కువగా నమోదవ్వడానికి ఇదొక కారణం. ఇదే దుర్మార్గులకు అనుకూలంగా మారింది. ముద్దు చేయడం, లైంగిక చర్యకు ప్రేరణ, రహస్య భాగాలను తాకడం, నగచిత్రాలను చూపడం వంటివి లైంగిక వేధింపుల్లో భాగమేననే విషయం చిన్నారులకు అర్థమయ్యేలా చెప్పాలి. విచారించాల్సిన విషయమేమంటే చాలా సందర్భాల్లో లైంగిక వేధింపులకు గురిచేసే వారు కుటుంబ సభ్యులు లేదా దగ్గరి బంధువులై ఉండటం వల్ల ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారు.

  • చట్టం ఏం చెబుతోంది..

2012 నవంబరు 14న ప్రవేశపెట్టిన ఫోక్సో(POCSO) చట్టం కింద నమోదైన కేసుల్లో నిందితులకు శిక్షలు పడింది చాలా తక్కువ. పిల్లలపై జరిగే లైంగిక నేరాల విషయంలో ఏడాదిలోగా విచారణ పూర్తి కావాలని చట్టం చెబుతోంది. కానీ ఆచరణలో మాత్రం అది సాధ్యం కావడంలేదు. చట్టం ప్రవేశపెట్టిన నాటి నుండి నమోదైన కేసుల్లో ఇప్పటికీ నిందితులకు శిక్ష పడనివే ఎక్కువ.

  • సుప్రీం ఆదేశాలు బేఖాతరు..

బాలలపై లైంగిక నేరాలు పెరిగిపోవడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. కేసుల పరిష్కారానికి ఎదురవుతున్న అవరోధాలను తొలగించే దిశగా కేంద్రానికి, రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేసింది. బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టం కింద వందకు మించి కేసులు నమోదైన చోట- ప్రతి జిల్లాలో కేంద్రప్రభుత్వ నిధులతోనే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని సుప్రీం ఆదేశించింది. వీటికి అవసరమైన నిధులు, మౌలిక వసతులను సమకూర్చడం, ప్రిసైడింగ్‌ అధికారి నియామకం, ఇతర ఉద్యోగులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు నియమాక బాధ్యత కూడా ప్రభుత్వాలు చూడాలని పేర్కొంది. కానీ చాలా చోట్ల సుప్రీం ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయి.

  • సమాజ దృక్పథం మారాలి

మన సమాజంలో నేరస్తులను నేరస్తులుగా చూడడం కంటే బాధితులను మానసికంగా వేధించడం ఎక్కువ. ఎక్కడైనా మైనర్‌పై అత్యాచార ఘటన వెలుగు చూసినప్పుడు శిక్ష పడిన నిందితుడి కంటే ఆ బాలిక, ఆమె కుటుంబం చాలా అభద్రతతో జీవించాల్సి వస్తోంది. బాధితురాలినే వేలెత్తి చూపుతున్నారు. భవిష్యత్తుపై భయానక పరిణామాలు దారితీసేలా ప్రవర్తిస్తుంటారు. వాళ్లపై జరిగిన దారుణాన్ని సరిగ్గా గుర్తించలేకపోవడం వల్లే చిన్న పిల్లలపై దాడులు జరగడంలో ప్రధాన కారణంగా కనపడుతోంది. తల్లిదండ్రులు లేని పిల్లలు, అనాథలు ఎక్కువగా టార్గెట్‌ చేసుకుంటు న్నారు. ఒక్కొక్కచోట ఉన్నత విద్యావంతుల కుటుంబాల పిల్లల్లో కూడా లైంగిక దాడుల విషయంపై బయటికి చెప్పడం లేదు. మొన్నీమధ్య విజయవాడలో ఒక పాప అపార్టుమెంటు మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకొంది. తన మీద జరుగుతున్న హింసను తల్లిదండ్రులతో చెప్పలేక తానే ప్రాణం తీసుకొంది. పిల్లలపై జరుగుతున్న నేరాలు ఆగాలంటే పిల్లలకు, తల్లిదండ్రులకు లైంగిక దాడులు, హింస వంటివాటిపై అవగాహన కల్పించాలి. నిందితులకు కఠినంగా శిక్షలు పడాలి. బాధితుల పట్ల సమాజ దృక్పథం మారాలి. స్త్రీలపై అవాకులు, చవాకులు మాట్లాడే ప్రవచనకర్తలు, నాయకుల వ్యాఖ్యలకు కళ్లెం వేయాలి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.

'పోస్కో'.. వయసు పది.. కేసులు లక్షల్లో..

 

 

 

- డి. రమాదేవి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.